
ఒడిశా టు మహారాష్ట్ర
● గుట్టుగా గంజాయి అక్రమ రవాణా
● రోడ్డు ప్రమాదంతో బయటపడిన 16.50 కిలోలు
అబ్దుల్లాపూర్‌మెట్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అతని నుంచి 16.50కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం శివారులో విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టిందన్న సమాచారం మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో కారును తనిఖీ చేశారు. కొన్ని టేపుతో చుట్టి ప్యాక్ చేసిన ప్లాస్టిక్ కవర్ల మూటలు కనిపించగా వాటిని పరిశీలించడంతో గంజాయి అని తేలింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఖమ్మం జిల్లా వాస్రం తండాకు చెందిన భుక్యా మధుగా వెల్లడించాడు. తనకు ఖమ్మం జిల్లాకు చెందిన సాదిబ్ అనే వ్యక్తి స్నేహితుడని, ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తే రూ.50వేలు ఇస్తారని చెప్పడంతో అంగీకరించినట్టు తెలిపాడు. రాజమండ్రిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా గంజాయి తీసుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు సరఫరా చేయాలని సూచించి రూ.50వేలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా మధు ప్రయాణిస్తున్న కారు బాటసింగారం వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు వెళ్లిన పోలీసులకు గంజాయి దొరికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధును అదుపులోకి తీసుకుని అతని నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
తలకొండపల్లిలో గంజాయి పట్టివేత
ఆమనగల్లు: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని తలకొండపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకారం.. తలకొండపల్లి మండల కేంద్రం సమీపంలోని ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఎస్‌ఐ శేఖర్, సిబ్బంది కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. కడ్తాల్ వైపు నుంచి వస్తున్న కారును ఆపుతుండగా అందులోనుంచి ఇద్దరు పారిపోతుండగా పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 287 గ్రాముల గంజాయి లభించింది. కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని తలకొండపల్లి గ్రామానికి చెందిన పద్మ వెంకటేశ్, కట్టమల్ల రఘువరన్‌గా గుర్తించారు. వారిని విచారించగా పద్మవెంకటేశ్ స్నేహితులు నగరంలోని ఉప్పల్‌కు చెందిన జోగురాజు, పిల్లి ప్రణయ్ గంజాయిని ఇచ్చారని వెల్లడించడంతో వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను శనివారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ శేఖర్, కానిస్టేబుల్ జాషువ, శ్రీను, శ్రీనివాస్‌ను సీఐ అభినందించారు.