సరదాల దందా! | - | Sakshi
Sakshi News home page

సరదాల దందా!

Aug 17 2025 8:23 AM | Updated on Aug 17 2025 8:23 AM

సరదాల దందా!

సరదాల దందా!

వీకెండ్‌ సరదాలకోసం నిర్మించుకున్న ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. బర్త్‌డే పార్టీలు, సరదా పార్టీలు, మందు పార్టీలు, రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి గలీజు దందాలకు నిలయాలుగా తయారయ్యాయి. ఎస్‌ఓటీ పోలీసులు తరచూ దాడిచేసి గుట్టు రట్టుచేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు.

మొయినాబాద్‌: నగర శివారులోని మొయినాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్‌, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలా మంది ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు. ఒక్క మొయినాబాద్‌ మండలంలోనే సుమారు వెయ్యికిపైగా ఉన్నాయి. చాలా మంది 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి అందులో ఫాంహౌస్‌ నిర్మిస్తున్నారు. వీకెండ్స్‌లో పిల్లలతో వచ్చి ఆనందంగా గడపడానికంటూ నిర్మించి తరువాత వాటిని లీజుకు, అద్దెకు ఇస్తున్నారు.

అద్దెకు తీసుకుని అడ్డగోలుగా..

లీజుకు తీసుకుంటున్న నిర్వాహకులు వాటిలో అడ్డగోలు దందాలు చేస్తున్నారు. గెట్‌టుగెదర్‌ పార్టీలు, ఫ్యామిలీ పార్టీలు, బర్త్‌డేలు అంటూ రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. వీటితోపాటు రేవ్‌ పార్టీలు, ముజ్రా పార్టీలు, పేకాట, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. యువకులను ఆకర్షించేలా ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం సైతం చేయిస్తున్నట్లు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బయటపెట్టాయి. పార్టీల్లో అక్రమంగా మద్యం తాగడం, హుక్కా, గంజాయి, డ్రగ్స్‌ వినియోగం జరుగుతోంది.

కేసులు పెడుతున్నా మారని తీరు

ఎస్‌ఓటీ పోలీసులు తరచూ దాడులు చేసి పార్టీలను భగ్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా పార్టీలు నిర్వహించేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఫాంహౌస్‌ల యజమానులు, నిర్వాహకులపై సైతం కేసులు పెడుతున్నారు. అయినా దందాలు మాత్రం ఆగడంలేదు. మామూళ్ల మత్తులో స్థానిక పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

వెలుగుచూసిన కొన్ని ఘటనలు

● ఏడాదిన్నర క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

● ఏడాది క్రితం నజీబ్‌నగర్‌ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్‌లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు.

● ఏడాది క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

● ఆరు నెలల క్రితం అజీజ్‌నగర్‌ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు.

● ఆరు నెలల క్రితం తోలుకట్ట రెవెన్యూలో ఓ ఎమ్మెల్సీకి చెందిన ఫాంహౌస్‌లో కోడిపందేలు నిర్వహిస్తుండగా ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. నిర్వాహకుడితోపాటు 64 మందిని పట్టుకున్నారు. భారీగా మద్యం, నగదు, క్యాసినో కాయిన్స్‌, కోడికత్తులు, కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

● నాలుగు నెలల క్రితం ఎత్‌బార్‌పల్లిలోని ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, 7 మంది యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్‌, మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

● తాగాజా గురువారం రాత్రి బాకారంలోని ఓ ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా మధ్యం వినియోగిస్తూ బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న 51 మంది విదేశీయులను ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి హుక్కా, 20 లీటర్ల విదేశీ మద్యం, 65 బీర్‌ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్‌ డిటేన్‌ సెంటర్‌కు విదేశీయులు

అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో బర్త్‌డే పార్టీ నిహించడంతోపాటు హుక్కా, విదేశీ మద్యం వినియోగించి పోలీసులకు పట్టుబడ్డ విదేశీయులను పోలీస్‌ డిటేన్‌ సెంటర్‌కు తరలించారు. బాకారం రెవెన్యూలోని ఎస్‌కే నేచర్‌ రీట్రీట్‌ ఫాంహౌస్‌లో గురువారం రాత్రి విదేశీయులు ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్‌ వినియోగిస్తూ నిర్వహించిన బర్త్‌డే పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఇందులో పట్టుబడ్డ 51 మంది విదేశీయుల్లో 36 మందికి వీసాగడువు ముగిసినట్లు గుర్తించా రు. వారిని సొంత దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటి వరకు వారిని కోర్టు సూచ నతో పోలీస్‌ డిటేన్‌ సెంటర్‌లో ఉంచుతామని ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్‌లు

పార్టీల పేరుతో గంజాయి, హుక్కా, మద్యం వినియోగం

యథేచ్ఛగా పేకాట, కోడి పందేలు, ముజ్రా పార్టీలు

అద్దెకు తీసుకుని గుట్టుగా నడుపుతున్న నిర్వాహకులు

తరచూ గుట్టు రట్టవుతున్నా పడని అడ్డుకట్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement