
విద్యుదాఘాతంతో కూలీ మృతి
కేశంపేట: దేవాలయ నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. కేశంపేట గ్రామంలో నిర్మిస్తున్న పోచమ్మ దేవాలయ పనులు చేసేందుకు తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజుకు కాంట్రాక్ట్ ఇచ్చారు. అతడి వద్ద అదే రాష్ట్రానికి చెందిన విజయబాలన్(40) పనులు చేసేందుకు గురువారం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో శుక్రవారం పనులు చేస్తుండగా దేవాలయం పక్కనుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన గ్రామ స్తులు చికిత్స నిమిత్తం విజయబాలన్‌ను కేశంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటునుంచి అంబులెన్స్‌లో షాద్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతి చెందాడు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు.
అనాఽథాశ్రమంలో వృద్ధుడి మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: అనారోగ్యంతో అనాథాశ్రమంలో ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాదర్‌గుల్‌లో ఉన్న మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో కన్నప్ప స్వామి(66) రెండేళ్ల క్రితం నాంపల్లి రైల్వేస్టేషన్ ఫుట్‌పాత్ సమీపంలో సంచరిస్తుండగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించారు. కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియలేదని, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
దక్షిణమధ్య రైల్వేలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలో 79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో జరిగినఇ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆర్‌పిఎఫ్ నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమా సింగ్ ఠాకూర్, సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, రైల్వే పాఠశాల,కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.