
వార్డు ఆఫీస్‌పై ఎగరని జెండా
మొయినాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద శుక్రవారం జాతీయ జెండాను ఎగరవేయకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో మొయినాబాద్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. ఇందులో మొయినాబాద్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, ఎనికేపల్లి, ముర్తూజగూడ, సురంగల్ గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఈ గ్రామాలు పంచాయతీలుగా ఉన్నప్పుడు జీపీ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో పంచాయతీ కార్యాలయాలను వార్డు ఆఫీసులుగా మార్చారు. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఎగురవేయకపోవడంతో చిలుకూరు గ్రామస్తులు మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్‌ను నిలదీశారు. వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేయవద్దనే నిబంధన ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కమిషనర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మిగతా గ్రామాల్లోని వార్డు కార్యాలయాల వద్ద సైతం జాతీయ జెండా ఎగరవేయకపోవడంతో ఆయా గ్రామాల నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండాను అవమాన పరిచే విధంగా వ్యవహరించారని మండిపడ్డారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
చిలుకూరులో మున్సిపల్ కమిషనర్‌ను నిలదీసిన ప్రజలు