
వేతన వెతలు!
ఉద్యోగ భద్రత కల్పించాలి
అప్పు చేయాల్సి వస్తోంది
ఏజెన్సీని ఎంపిక చేయగానే..
● ఐదు నెలలుగా నిలిచిన జీతాలు
● ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాలు
● ఆర్థిక ఇబ్బందుల్లో ల్యాబ్‌టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు,
● 104 డ్రైవర్లు, ఏఎన్‌ఎంలు, సపోర్టింగ్ స్టాఫ్
● అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడం.. వెరసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులకు మించి పని చేస్తున్నప్పటికీ అరకొరగా ఇచ్చే నెలవారీ వేతనాలు కూడా ఐదు నెలలుగా ఇవ్వకపోవడంతో ఆయా ఉద్యోగులంతా ఇంటి అద్దెల చెల్లింపు, నిత్యావసరాల కొనుగోలు, పిల్లల స్కూలు ఫీజుల కోసం స్నేహితులు, బంధువుల వద్ద చేయి చాచాల్సి వస్తోంది. చేసిన అప్పులు పేరుకపోతుండటం, గడువు ముగియడంతో ఇచ్చిన వారు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆర్థికంగానే కాదు మానసికంగానూ కుంగిపోవాల్సి వస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 167 మంది ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు, ఏఎన్‌ఎంలు జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.
థర్డ్ పార్టీ ఏజెన్సీ లేక నిలిచిన చెల్లింపులు
మారుమూల పల్లెల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 104 సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, ఆస్తమా, ఫిట్స్, దగ్గు, జలుబు, జ్వరం, గర్భిణులకు పరీక్షలు చేసి నెలకు సరిపడా మందులు సరఫరా చేసేవారు. మొదట్లో హెచ్‌ఎంఆర్‌ఐ భాగస్వామ్యంతో సిబ్బంది నియామకం, వేతనాలు చెల్లింపు చేసేవారు. పదిహేనేళ్ల క్రితం ఉద్యోగులంతా 111 రోజుల పాటు ధర్నా చేసి థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయించారు. తర్వాత కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి సారథ్యంలో థర్డ్‌పార్టీని ఎంపిక చేసి, దాని ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారు. జిల్లాలో 104 విభాగంలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, సెక్యురిటీగార్డు మొత్తం 56 మంది ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌కు నెలకు రూ.22,750 చెల్లిస్తుండగా పీఎఫ్ కటింగ్స్ పోను రూ.20,020 ఖాతాల్లో జమ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్‌కు రూ.19,500 వేతనంలో ఈఎస్‌ఐ, పీఎఫ్ కటింగ్ పోను రూ.17 వేల వరకు వారి ఖాతాల్లో జమ అవుతోంది. జిల్లాలో థర్డ్‌పార్టీ ఏజెన్సీ గడువు మార్చితో ముగిసింది. కొత్త ఏజెన్సీని ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. ఏ ఖాతా నుంచి సిబ్బందికి వేతనాలు చెల్లించాలనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
పదిహేడేళ్లుగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నా. ఇప్పటి వరకు రెగ్యులర్ కాలేదు. వేతనం పెరగలేదు. ఇచ్చే కొద్దిపాటి కూడా నెలవారీగా ఇవ్వడం లేదు. నా భర్త కూడా ప్రైవేటు ఉద్యోగే. మాకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజులు, ఇంటి అద్దె, నిత్యావసరాల కొనుగోలు కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా విధిగా వేతనాలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
– ఝాన్సీ, డేటా ఎంట్రి ఆపరేటర్, షాద్‌నగర్
కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌లో పని చేస్తున్నాను. అదే ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నా. నెలకు రూ.ఏడు వేలు చెల్లించాల్సి ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. వారి స్కూలు ఫీజు, సరుకులు, ఇంటి అద్దె చెల్లింపు, ఇతర ఖర్చుల కోసం రూ.20వేలు అవుతోంది. ఐదు నెలలుగా వేతనాలు అందక బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేయాల్సి వస్తోంది.
– ఎస్.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, 104 యూనియన్
ఔట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా వేతనాలు చెల్లించే అవకాశం లేదు. థర్డ్‌పార్టీ ద్వారానే చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఏజెన్సీ గడువు ముగిసింది. రెన్యూవల్ లేదా కొత్త ఏజెన్సీ ఎంపికలో జాప్యం జరిగింది. వేతనాలకు సంబంధించి రూ.48 లక్షలు జిల్లా వైద్యారోగ్యశాఖ ఖాతాలో ఉన్నాయి. ఐదు నెలలుగా చెల్లింపు నిలిచి పోయిన మాట వాస్తవమే. ఏజెన్సీ ఎంపిక చేసిన వెంటనే చెల్లిస్తాం.
– డాక్టర్ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌ఓ