
1,500 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్‌లో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని 1,500 మహాత్మా గాంధీ విగ్రహాలను ప్రదర్శించారు. గాంధీ గ్లోబల్ క్లబ్ ఫ్యామిలీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శనతో విద్యార్థులకు గాంధీ గొప్పతనాన్ని తెలియజేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకే పాఠశాలలో 1,500 విగ్రహాలను ప్రదర్శించినందుకుగాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుందని ఇంటర్నేషనల్ చీఫ్ కో–ఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు స్కూల్ ఎండీ చింతల సంగమేశ్వర గుప్తాకు మెమెంటోను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.
బడంగ్‌పేట్: వరద ముంపు కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. గుర్రంగూడ, శ్రీనివాసపురం, పంచాయతీరాజ్‌నగర్ తదితర ముంపు కాలనీలను శుక్రవారం ఆమె సందర్శించారు. వరద ఉన్న కాలనీలల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో వర్షాలు, వరదలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు డ్రైనేజీ నాలాలను శుభ్రం చేయించేవారన్నారు. దీంతో ప్రజలకు ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మాజీ కౌన్సిలర్ గుర్రం సాయికిరణ్‌రెడ్డి, కాలనీవాసులు ఉన్నారు.
18న వ్యాపార సంస్థల బంద్
ఆమనగల్లు: స్థానిక వ్యాపార సంఘాలు ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమానికి సిద్ధమయ్యాయి. మనప్రాంతం.. మన వ్యాపారం పేరుతో ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఈనెల 18న ఆమనగల్లు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. మార్వాడీలు కిరాణం, స్వీట్స్, హార్డ్‌వేర్‌తో పాటు అన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించారని, దీన్ని స్థానిక వ్యాపార సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. బంద్‌కు మద్దతు పలకాలని కోరుతూ కరపత్రాలు పంచుతున్నాయి.
అబ్దుల్లాపూర్‌మెట్: బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌గా కొత్తపల్లి జైపాల్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సహకార సంఘం పరిధిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఇష్టారాజ్యంగా వడ్డీలు మాఫీ చేశాడంటూ తాజా మాజీ చైర్మన్ చేగూరి భరత్‌కుమార్‌పై కొంతమంది మాజీ సర్పంచులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన జిల్లా సహకార శాఖ అధికారులు ఆయన్ని పదవి నుంచి తొలగించారు. అనంతరం జైపాల్‌రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సంఘం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కందాడి మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మేనేజర్ జక్కుల ఐలేశ్ పాల్గొన్నారు.

1,500 గాంధీజీ విగ్రహాల ప్రదర్శన