
ఓర్వలేకే తప్పుడు ఫిర్యాదులు
అబ్దుల్లాపూర్‌మెట్: సహకార సంఘం అభివృద్ధిని చూసి ఓర్వలేక తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి పదవి నుంచి తప్పించారని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ చేగూరి భరత్ కుమార్ అన్నారు. తారామతిపేటలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన హయాంలో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. కేవలం ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.12 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామని తెలిపారు. గతంలో చైర్మన్‌గా పనిచేసిన విఠల్‌రెడ్డి 2013 నుంచి 2020 మధ్యకాలంలో ఎలాంటి తీర్మానం లేకుండా 272 మందికి రూ.23 లక్షలకు పైగా రుణాలపై వడ్డీ మాఫీ చేశారని ఆరోపించారు. ఇదే తరహాలో తాను కూడా 58 మంది నిరుపేద రైతులు, చనిపోయిన రైతు కుటుంబాలకు వడ్డీలో రూ.15 లక్షల 46వేలు మాఫీ చేశామని తెలిపారు. మజీద్‌పూర్ మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు సంఘం నుంచి రూ.కోటిన్నర మేర రుణాలు తీసుకుని 11 ఏళ్లుగా చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంతోనే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్లు మొగుళ్ల యాదిరెడ్డి, మేకల రాములు, చింతల లక్ష్మమ్మల తదితరులు పాల్గొన్నారు.
బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్ భరత్‌కుమార్