
ప్రజలను అప్రమత్తం చేయండి
కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం వర్షాల కారణంగా రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అన్ని శాఖల అధికారులు తు.చా తప్పకుండా పాటించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి శాఖ అధికారులు వారి పరిధిలో విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్నారు. కాజ్‌వేల మీద ఎవరూ ప్రయాణం చేయకుండా చూడాలన్నారు. చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి అధికారులు హెడ్‌క్వార్టర్ మెయింటెన్ చేయాలని, వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరెంట్ స్తంభాల వద్ద జాగ్రత్తలు అవసరమన్నారు. ప్రధాన రహదారిపై నీరు ఆగిపోతే వెంటనే స్పందించాలన్నారు. శిథిలావస్థ భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. అకారణంగా ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలన్నారు. డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 24 గంటలు పని చేస్తుందన్నారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, సమస్యలను తక్షణమే తెలియజేయాలని సూచించారు.