
కానిస్టేబుల్‌కు క్యాష్ రివార్డు
కడ్తాల్: కేసు చేధనలో వృత్తి నైపుణ్యం కనబరిచిన కానిస్టేబుల్ రాజశేఖర్ బుధవారం క్యాష్ రివార్డు అందుకున్నారు. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన కొమ్మరి శివకృష్ణ హైదరాబాద్‌లో టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కోడేరులో తన చెల్లెలు స్వప్న పురుగు మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని సమాచారం అందడంతో ఈ నెల 8న తెల్లవారు జామున ఆయన తన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. కడ్తాల్ మండల కేంద్రం సమీపానికి చేరుకోగానే, గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ రాజశేఖర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, సీసీ టీవీ పుటేజీ సహకారంతో 24 గంటల వ్యవధిలోనే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆయనకు ఠాణాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్‌ఐలు వరప్రసాద్, చంద్రశేఖర్‌లు, కానిస్టేబుల్ రాజశేఖర్‌కు ప్రోత్సాహకంగా రూ.5 వేలు క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు.