
పెన్షన్ పెంచి ఇవ్వాలి
షాద్‌నగర్‌రూరల్: ప్రభుత్వం పెన్షన్‌దారులకు పెన్షన్ పెంచి ఇచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాగల్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగల్ల ఉపేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత పెన్షన్ రూ. 4వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని అన్నారు. అందాల పోటీలు, భూ స్వాములు, రైతు భరోసాకు, అభివృద్ధి పేరుతో, యాడ్‌ల పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు దివ్యాంగులు, చేయూత పెన్షన్‌దారులకు పెన్షన్ ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోరాటాల ద్వారానే గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 16న షాద్‌నగర్‌లో నిర్వహించనున్న పెన్షన్‌దారుల సభకు మందకృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, చేయూత పెన్షన్‌దారులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు బాలరాజు, సురేష్, అశోక్, పాండు, శ్రవణ్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.