
నిధుల స్వాహాపై విచారణ
యాచారం: చౌదర్‌పల్లి గ్రామ స్వయం సహాయక సంఘాల్లో నిధుల స్వాహాపై బుధవారం అధికారులు విచారణ మొదలుపెట్టారు. గ్రామంలోని 30కి పైగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు అందాల్సిన దాదాపు రూ.2 కోట్లకు పైగా నిధులను ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాహా చేసిన విషయం వెలుగులోకి రావడంతో రెండోరోజు కూడా గ్రామ మహిళలు ఆందోళన కొనసాగించారు. అప్పటి బ్యాంకు మేనేజర్ ఝాన్సీరాణిని పిలిచి వీబీకేతో కలిపి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
కుమ్మకై ్క నిధుల స్వాహా!
ఏదైనా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే ఐకేపీ అధికారుల నుంచి మైక్రో క్రెడిట్ ప్లాన్ (ఎంసీపీ) రికార్డులు అందిన తర్వాతే మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ యాచారం ఎస్‌బీఐలో మాత్రం వీబీకే వరలక్ష్మి, అప్పటి మేనేజర్ కుమ్మకై ్క ఎంసీపీ లేకుండానే నకిలీ డాక్యుమెట్లు, ఫోర్జరీ సంతకాల రికార్డులు సృష్టించి నిధుల స్వాహాకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అధికారుల ఫిర్యాదుల ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఐకేపీ సిబ్బందితో డీఆర్‌డీఏ డీపీఎం సమావేశం
చౌదర్‌పల్లి సీసీ, వీబీకే పాత్రలపై వివరాల సేకరణ
రెండోరోజు కొనసాగిన మహిళల ఆందోళన
అధికారుల విచారణ
చౌదర్‌పల్లిలోని స్వయం సహాయక సంఘాల్లో జరిగిన అక్రమాలను ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. డీఆర్‌డీఓ శ్రీలత ఆదేశాల మేరకు డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ (డీపీఎం) లీలాకుమారి బుధవారం యాచారంలోని ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎం రవీందర్, చౌదర్‌పల్లి సీసీ జంగయ్య, ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. అక్రమాలు జరుగుతుంటే ఏం పర్యవేక్షణ చేస్తున్నావని సీసీ జంగయ్యపై మండిపడ్డారు. ఎంసీపీలు పంపకుండానే వీబీకే, అప్పటి బ్యాంకు మేనేజర్ కలిసి నిధుల స్వాహాకు పాల్పడినట్లు ఆయన సమాధానమిచ్చారు. రికార్డులను పరిశీలించి ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై విచారణ చేపడతామని ఆమె తెలిపారు. అప్పటి బ్యాంకు మేనేజర్ ఝాన్సీరాణి పాత్రపై ఎస్‌బీఐ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఏజీఎం రామకృష్ణయ్య యాచారం ఎస్‌బీఐలో విచారణ చేపట్టారు. 2022 నుంచి చౌదర్‌పల్లిలోని స్వయం సహాయక సంఘాలకు ఎన్ని రుణాలిచ్చారు, ఫోర్జరీ సంతకాలతో కూడిన నకిలీ డాక్యుమెంట్లను తనిఖీలు చేశారు. అవసరమైతే ఝాన్సీరాణిని పిలిచి విచారణ చేపడతామని తెలిపారు.