
చుక్క నీరు చేరలే..
బాతుల చెరువు వెత
● ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ● అయినా వెలవెలబోతున్న కొన్ని చెరువులు ● ఆక్రమణలు.. అడ్డుగా నిర్మాణాలే కారణం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అనేక వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. షాబాద్, పరిగి, షాద్‌నగర్, శంషాబాద్, మొయినాబాద్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్‌సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఐదు రోజుల క్రితమే నాలుగు గేట్లు తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు. జంటజలాశయాల్లో కీలకమైన హిమాయత్‌సాగర్ గలగల పారుతుంటే ఉస్మాన్‌సాగర్ మాత్రం వెలవెలబోతోంది. జలాశయం ఎగువ ప్రాంతంలోని శంకర్‌పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, మర్పల్లి, వికారాబాద్‌లోని వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడం, వాటిలో పెద్దఎత్తున ఫాం హౌస్‌లు వెలియడం, చెరువులోకి వరదనీటిని తెచ్చే వాగులకు అడ్డుగా భారీ ప్రహరీలు నిర్మించడమే ఇందుకు కారణం.
వెలవెలబోతున్న బాతుల చెరువు