
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
పహాడీషరీఫ్: వర్షాల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారి శ్రీనివాస్ అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జల్‌పల్లి మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు, బుర్హాన్‌ఖాన్ చెరువులను బుధవారం ఆయన కమిషనర్ వెంకట్రామ్‌తో కలిసి పరిశీలించారు. పెద్ద చెరువు పూర్తి స్థాయిలో నిండి పారుతున్న అలుగును పరిశీలించారు. మిగులు నీరు పి–7 కార్గో రోడ్డులో పారుతూ వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా చూశారు. చెరువుకు ఎక్కడి నుంచి నీరు వస్తోది.. మరిన్ని వర్షాలు కురిస్తే కట్ట సామర్థం ఏమిటి తదితర విషయాలపై నీటి పారుదల శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్‌ను అడిగి తెలుసుకున్నారు. మిగులు నీరు రోడ్డుపైకి రాకుండా అడ్డుగోడ కట్టే విషయమై అధ్యయనం చేయాలని సూచించారు. తర్వాత జల్‌పల్లి కమాన్ రోడ్డులో నీట మునుగుతున్న రెండు కల్వర్ట్‌లను పరిశీలించారు. కల్వర్ట్‌ల ఎత్తు పెంచేందుకు అంచనాలు రూపొందించాలన్నారు. అనంతరం ఉస్మాన్‌నగర్‌లోని బుర్హాన్‌ఖాన్ చెరువును పరిశీలించి ముంపు ఇళ్లలో ఎవరైనా ఉంటే, ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ ఇష్రత్ ఆయేషా తదితరులు పాల్గొన్నారు.