
‘లింక్ కల’వదే!
కడ్తాల్: పల్లెలు ప్రగతి పథంలో నడవాలంటే రహదారులు ప్రధానం. కానీ పలు గ్రామాలను కలిపే లింక్ రోడ్లు ఏళ్ల తరబడి అనుసంధానానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు, ప్రయాణికులు కల దశాబ్దాలుగా నెరవేరడం లేదు. వీటిని బాగు చేయాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులను వేడుకున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎక్వాయిపల్లి నుంచి గోవిందాయిపల్లి, గోవిందాయిపల్లి నుంచి గోవిందాయిపల్లితండా, చల్లంపల్లి– మక్తమాధారం, వంపుగూడ –టాక్‌రాజ్‌గూడ, మక్తమాధారం– పెద్దారెడ్డి చెరువుతండా, కర్కల్‌పహాడ్– వంకరాయితండా, సాలార్‌పూర్– రేకులకుంటతండా, చల్లంపల్లి– రేకులకుంటతండా, చల్లంపల్లి– పీవీబాయితండా, వంపూగూడ– పీవీ బాయితండా, ముద్వీన్– కోనాపూర్ రోడ్డు, వాసుదేవ్‌పూర్ నుంచి బాలాజీనగర్‌తండా, మైసిగండి– గానుగుమార్లతండాకు చెందిన అనుసంధాన రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మట్టి రోడ్లు బురదమయం అవుతున్నాయని పేర్కొంటున్నారు. పలు గ్రామాలకు ద్విచక్రవాహనాలు, ఆటోలు కూడా వెళ్ల లేని పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలుగా గడిచినా లింక్ రోడ్ల అభివృద్ధికి అడుగులు పడటం లేదని మండల ప్రజలు, తండాల గిరిజనులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
బీటీ రోడ్లుగా అభివృద్ధి చేస్తే..
● గోవిందాయిపల్లి మీదుగా ఎక్వాయిపల్లి, మైసిగండి వరకు బీటీ రోడ్డు నిర్మించి, ఆర్టీసీ బస్సులు నడిపిస్తే గోవిందాయిల్లి ప్రజలు, విద్యార్థులు, రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
● చల్లంపల్లి నుంచి మక్తమాధారం వరకు బీటీ నిర్మిస్తే రావిచేడ్, మక్తమాధారం, షాద్‌నగర్ తది తర గ్రామాల మధ్య దూరభారం తగ్గడంతో పా టు రవాణా సదుపాయం మెరుగుపడుతుంది.
● ముద్వీన్– కోనాపూర్ రహదారిని బీటీగా అభివృద్ధి చేస్తే ఆకుతోటపల్లి, ఆమనగల్లు తదితర గ్రామాలకు వెళ్లేందుకు దూరం తగ్గడంతో పాటు ఆయా గ్రామాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.
● వాస్‌దేవ్‌పూర్ నుంచి బాలాజీనగర్‌తండా వరకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తే, చల్లంపల్లి, తలకొండపల్లి తదితర గ్రామాలకు వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వంలో నైనా ఆయా లింక్ రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అధ్వానంగా అనుసంధాన రహదారులు
బస్సు సౌకర్యానికి సైతం నోచుకోని
పలు తండాలు, గ్రామాలు
దశాబ్దాలుగా అవస్థలు పడుతున్న ప్రయాణికులు, ప్రజలు
ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు

‘లింక్ కల’వదే!