
షార్ట్‌సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం
మహేశ్వరం: భారీ వర్షాల నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని తుమ్మలూరులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన అక్కెర రమాదేవి ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా టీవీ, రిఫ్రిజిరేటర్, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు, దుస్తువులు కాలిపోయాయి. తమది నిరుపేద కుటుంబమని.. భర్త మరణించాడని ఇద్దరు కూతుర్లను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ జీవనం సాగిస్తున్నాని ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని కోరింది. విద్యుత్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు పత్రం సమర్పించారు.
కృత్రిమ ఇసుక తయారీ
కేంద్రంపై దాడి
● ఫిల్టర్ ధ్వంసం
● లారీ, ట్రాక్టర్ సీజ్
కడ్తాల్: కృత్రిమ ఇసుక తయారు చేసినా, అనుమతులు లేకుండా ఇసుక తరలించినా చర్యలు తప్పవని సీఐ గంగాధర్ హెచ్చరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం రెవెన్యూ సిబ్బంది, పోలీసులు అధికారులు మండల పరిధిలోని ముద్వీన్‌లో కొనసాగుతున్న కృత్రిమ ఇసుక తయారీ కేంద్రంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఫిల్టర్‌ను ధ్వంసం చేశారు. ఫిల్టర్ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, లారీని సీజ్ చేశారు. ఈ దాడుల్లో ఏఎస్‌ఐ బాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాములు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
పోల్కంపల్లిలో గేదెల అపహరణ
ఇబ్రహీంపట్నం: గుర్తు తెలియని దుండగులు రెండు గేదెలను అపహరించుకొని వెళ్లిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని పొల్కంపల్లి అనుబంధ గ్రామమైన జాజోనిబావి గ్రామానికి చెందిన కసరమోని ఐలయ్య మంగళవారం రాత్రి తన డెయిరీ ఫాం వద్ద ఉన్న గదిలో నిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి ఐలయ్య నిద్రిస్తున్న గదికి బయటి నుంచి తాళం వేసి రెండు గేదెలను తీసుకుని పరారయ్యారు. బుధవారం తెల్లవారుజామున ఐలయ్య మెల్కోని డోర్ తీసే ప్రయత్నం చేయగా తెరుచుకోలేదు. దీంతో కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు అక్కడికి చేరుకొని తాళం పగులగొట్టారు. సుమారు రూ.3లక్షల విలువ చేసే గేదెలను అపహరించుకొని వెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.