
అక్రమాలు సహించేది లేదు
ఆమనగల్లు: రైస్‌మిల్లర్లు ప్యాడిరైస్, రైస్‌మిల్లర్ల నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు హెచ్చరించారు. మండల పరిధి పోలెపల్లి గ్రామంలోని శ్రీరామ రైస్‌మిల్లులో మంగళవారం సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ సూర్యనారాయణ, డీఎస్పీ రమణారెడ్డి, సీఐ అజయ్, ఎస్‌ఐ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, టీఏ జంగయ్య ఆధ్వర్యంలోని బృందం ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీల్లో 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన ప్యాడీరైస్ 33,47,960 క్వింటాళ్ల కేటాయింపు కాగా ప్రస్తుత తనిఖీల్లో 19,80,130 క్వింటాళ్లు తక్కువగా వచ్చినట్లు గుర్తించామని అడిషనల్ ఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. తక్కువగా వచ్చిన ప్యాడీరైస్ విలువ రూ.7.10 కోట్లు ఉంటుందన్నారు. అక్రమాలకు పాల్పడిన మిల్లు యజమానిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. లక్ష్మీ వెంకటసాయి రైస్‌మిల్లులోనూ తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. అక్రమాలకు పాల్పడే రైస్‌మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మిల్లులు సీజ్ చేస్తామని హెచ్చరించారు.