
వివాహిత అదృశ్యం
కేశంపేట: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని లేమామిడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపంగి మల్లేశ్‌కు కల్వకుర్తి మండలం సిలార్‌పల్లి గ్రామానికి చెందిన గీతతో గతేడాది వివాహం జరిగింది. అయితే గీత రాఖీ పండగకు పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మణికొండ: ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతూ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజామాబాద్ జిల్లా అక్కునూరు గ్రామానికి చెందిన బి.సుస్మిత (18) ఇబ్రహీంబాగ్‌లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంది. నార్సింగిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో మరో ఇద్దరితో కలిసి ఉంటుంది. సోమ వారం రూమ్‌మేట్ అర్చన కిందకు వెళ్లగా..గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. అర్చన తిరిగి వచ్చి తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా లోపల గడియ వేసి ఉంది. దీంతో వార్డెన్ నవీనకు విషయం తెలిపింది. ఇద్దరు వచ్చి డోర్‌ను తెరిచి చూడగా సుస్మిత ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే 108కు ఫోన్ చేయటంతో వారు వచ్చి ఆమె మృతిచెందినట్టు ధృవీకరించారు. హాస్టల్ నిర్వాహకుడు సాయికిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆత్మహత్యకు కారణా లపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మేడ్చల్ రూరల్: బైక్‌పైన వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఏపీలోని తెనాలి జిల్లా వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన కేసాని మధు(50) బతుకుదెరువు కోసం మేడ్చల్ వలస వచ్చాడు. కేఎల్‌ఆర్ వెంచర్‌లో నివాసం ఉంటూ మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులకు వెళ్లిన మధు మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఇంటికి బైక్‌పై బయల్దేరాడు. మేడ్చల్‌లోని వివేకానంద విగ్రహం వద్దకు రాగానే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బైక్ కుడివైపు ఉన్న హ్యాండిల్‌కు తగలడంతో మధు లారీ చక్రాల కిందకు పడిపోయాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.