
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు
● సమన్వయంతో
సమస్యలు లేకుండా చూడాలి
● కలెక్టర్ సి.నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వీఐపీలు, అధికారులు, మీడియా ఇతరులకు సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్య అథితి సందేశం రూపొందించేదుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపాలన్నారు. వేడుకలకు హాజరయ్యే అతిథికి గౌరవ వందనంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దని విద్యుత్ అధికారులకు సూచించారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డీఈఓకు చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కె.శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏఓ సునీల్‌కుమార్, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా అధికారులు, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కె.శ్రీనివాస్, డీఆర్‌ఓ సంగీత ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దారులు, సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.