
‘రియల్’ డీలా!
ఆర్థిక మాంద్యం, హైడ్రా ఎఫెక్ట్●
● పడిపోయిన భూముల క్రయవిక్రయాలు ● భారీగా తగ్గిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రియల్ భూం జిల్లాలో పడిపోయింది.అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభా నికి తోడు పెరిగిన భూముల ధరలు.. హైడ్రా కూల్చి వేతలతో ఆస్తుల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి.రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఆస్తుల రిజిస్ట్రే షన్ల సంఖ్య భారీగా తగ్గింది. 2023 జన వరి నుంచి జూలై వరకు జిల్లావ్యాప్తంగా 1,47,091 ఆస్తులకు రిజిస్ట్రేన్లు కాగా వీటి ద్వారా రూ.2,157.60 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి జూలై ఆఖరి వరకు 1,50,247 రిజిస్ట్రేషన్లు కాగా, వీటి ద్వారా రూ. 2,481.58 కోట్ల రాగా.. తాజాగా ఏడు నెలల్లో 1,47,236 డాక్యుమెంట్ల ద్వారా రూ.2,518. 98 కోట్లు వచ్చాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం కొసమెరుపు.
కోవిడ్ సంక్షోభం తర్వాత
కోవిడ్ సంక్షోభం తర్వాత రియల్ భూం ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. నగరానికి ఆనుకుని ఉన్న కోకాపే ట, నార్సింగి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, శంకర్‌పల్లి, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, పెద్ద అంబర్‌పేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మణికొండ, తుక్కుగూడ, ఆది బట్ల, కొత్తూరు, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కోకాపేటలో ఎకరం ఏకంగా రూ.100 కోట్లకుపైగా పలికింది. ఓఆర్‌ఆర్‌కు అటు ఇటుగా కొత్తగా అనేక గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరేంజ్ అపార్ట్‌మెంట్లు వెలిశాయి. వీటిలోని ప్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసేందుకు నగర వాసులే కాకుండా దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్‌ఆర్‌ఐలు, బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపాయి. ఫలితంగా రోజుకు సగటున 750 నుంచి 1000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది.
రోడ్డున పడ్డ కమీషన్ ఏజెంట్లు
అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఆస్తుల అమ్మకాలు మందగించాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గి ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. భవిష్యత్తుపై ఆశతో భూములపై భారీగా పెట్టుబడి పెట్టిన చిరు వ్యాపారులు తమ వెంచర్లలోని ఖాళీ స్థలాలు అమ్ముడుపోక ఆర్థికంగా చితికిపోతున్నారు. అప్పటి వరకు రియాల్టీపై ఆధారపడిన కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం విలవిల్లాడిపోతున్నారు. ఒకప్పుడు ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారు ప్రస్తుతం రోజువారీ ఖర్చుల కోసం తమ వద్ద ఉన్న ఆస్తులు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉపాధి లేకపోవడంతో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోగా, మరికొంత మంది జీవితాలు రోడ్డునపడ్డాయి.
జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు ఇలా..
మాసం 2023 2024 2025
జనవరి 18,942 18,818 18,174
ఫిబ్రవరి 20,477 22,272 18,880
మార్చి 23,253 21,451 23,552
ఏప్రిల్ 19,025 18,426 22,508
మే 23,184 19,448 22,144
జూన్ 21,121 21,103 20,116
జూలై 21,089 28,729 21,862
ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం (రూ.కోట్లలో)
మాసం 2023 2024 2025
జనవరి 306.25 274.32 259.91
ఫిబ్రవరి 273.41 397.27 335.53
మార్చి 331.27 406.85 359.17
ఏప్రిల్ 325.00 319.30 383.82
మే 338.55 290.91 379.57
జూన్ 326.30 332.99 440.57
జూలై 256.82 459.94 360.61