
‘నులి’మేద్దాం
● నేటి నుంచి నులి పురుగులనిర్మూలన కార్యక్రమం ● 1 నుంచి 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
షాద్‌నగర్: చిన్న పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతకు కారణమయ్యే నులిపురుగులను నివారించేందు కు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 1 నుంచి 19 ఏళ్లలోపు చిన్నారులు, కిశోర బాలిలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనుంది. సోమవారం నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ స్కూళ్లలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పరిశుభ్రతే ప్రధానం
అపరిశుభ్రతతోనే నులిపురుగులు శరీరంలో ప్రవేశిస్తుంటాయి. మట్టిలో ఆడుకోవడం, అదే చేతులతో ఆహార పదార్థాలు తినడం వంటివి చేస్తుంటారు. దీంతో మట్టిలో ఉన్న పురుగులు నోటి ద్వారా పేగుల్లోకి చేరి అక్కడ తిష్టవేస్తాయి. పేగులో ఉన్న ఆహారంలోని పోషకాలను గ్రహిస్తూ మెల్లగా వృద్ధి చెందుతాయి. దీంతో చిన్నారుల్లో రక్తహీనత ఏర్పడుతుంది. నులిపురుగులు పెరిగి కడుపునొప్పి, వాంతులు, విరోచనాలకు దారి తీస్తుంది. ఒక్కోసారి చిన్నారులు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. చేతులను, చేతి గోళ్లను శుభ్రం చేసుకునేలా, పరిశుభ్రమైన నీటిని తాగేలా వారికి చిన్నతనం నుంచి నేర్పించాలి.
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి..
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి, ఇతర మందులు వాడుతున్నవారికి, ఫిట్స్ ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు వేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యశాఖ మార్గ దర్శకాల ప్రకారం 1–3 ఏళ్లలోపు చిన్నారుకుల సగం మాత్రను చెంచాలో పొడి చేసి కొంచం నీరు కలిసి తాగించాలి. 3–19 ఏళ్లలోపు చిన్నారులు, కిశోర బాలలకు పూర్తి మాత్రను ఇచ్చి బాగా నమిలి మింగమని చెబుతున్నారు. మాత్ర వేసిన తర్వాత కొద్ది మందిలో స్వల్ప దుష్ఫలితాలు కనిపిస్తాయని దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు.
తప్పనిసరి వేయించాలి
చిన్నారుల ఆరోగ్య సంక్షేమానికి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 11న చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా వేయించాలి.
– డాక్టర్ విజయలక్ష్మి,
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, షాద్‌నగర్