పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరిస్తాం

May 17 2025 8:15 AM | Updated on May 17 2025 8:15 AM

పెన్షన్‌దారుల  సమస్యలు పరిష్కరిస్తాం

పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరిస్తాం

కలెక్టర్‌ నారాయణరెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: పెన్షన్‌దారుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం పెన్షన్‌ ఆదాలత్‌, జీపీఎఫ్‌ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 27 ప్రభుత్వ శాఖల్లో పని చేసిన 93 పెన్షన్‌ పెండింగ్‌ దరఖాస్తులు 39 మంది పెన్షనర్లు, జీపీఎఫ్‌ చందాదారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. సంబంధిత అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా సమస్యలు లేకుండా చూస్తామని చెప్పారు. దరఖాస్తులను అకౌంటెంట్‌ జనరల్‌ హైదరాబాద్‌ తెలంగాణ వారికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ ఎంఎస్‌ చందా పండిట్‌, అభయ్‌, సోనార్కర్‌, డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ పద్మావతి, జిల్లా రెవెన్యూఅఽధికారి సంగీత, డిప్యూటీ డైరెక్టర్‌ రాజు, సంబంధిత శాఖల అధికారులు, పెన్షనర్లు పాల్గొన్నారు.

ఈ నెల 21 వరకు ‘దోస్త్‌’

షాద్‌నగర్‌రూరల్‌: ఇంటర్మీడియెట్‌ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా డిగ్రీలో చేరేందుకు ఈ నెల 21 వరకు గడువు ఉందని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీతాపోలె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీ అడ్మిషన్లకు దోస్త్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేరుకోవాలని తెలిపారు. ఈ నెల 29న తొలి అడ్మిషన్ల కేటాయింపు జాబితా కళాశాలకు విడుదల అవుతుందని చెప్పారు. ఈ నెల 30 నుంచి జూన్‌ 6 వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని వివరించారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరాలనుకునే విద్యా ర్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 63050 51490, 98850 03390, 97034 41345 నంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

వెంటనే విడుదల చేయాలి

ఆమనగల్లు: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో భాగంగా బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బకాయి ఉన్న దాదాపు రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఓటీఎస్‌ కింద సెటిల్‌చేసి విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చెల్లిస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. వెంటనే బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. సమావేశంలో టీఎస్‌ఎస్‌ఓ నాయకులు వంశీ, సుదర్శన్‌, చిక్కి, సందీప్‌ తదితరులు ఉన్నారు.

ఇన్వెస్ట్‌మెంట్స్‌ పేరుతో రూ.15.2 లక్షలు స్వాహా

సాక్షి, సిటీబ్యూరో: పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు రూ.15.2 లక్షలు స్వాహా చేశారు. వివరాలివీ.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగికి గత నెల 9న వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. తమ సూచనలతో స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ ట్రేడింగ్‌ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. తమ కంపెనీ పేరు ‘ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌’ అని, తమకు సెబీ అనుమతి కూడా ఉందని నమ్మించారు. ఐసీఐసీఐ సెక్యూరిటీ ట్రేడింగ్‌ పేరుతో ఉన్న యాప్‌ను లింక్‌ ద్వారా షేర్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దాన్ని ఇన్‌ స్టల్‌ చేసుకుని, యాక్టివేట్‌ చేసుకోవాలని సూచించారు. అలా చేసిన బాధి తుడు దాని ద్వారానే నేరగాళ్ల ఖాతాల్లోకి రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.8.2 లక్షల చొప్పున బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు, లాభాలతో కలిపి బ్యాలెన్స్‌ రూ.91.21 లక్షలకు చేరినట్లు యాప్‌లో బాధి తుడికి కనిపించింది. ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. నగదు వెనక్కు తీసుకోవాలంటే మరో రూ.4.3 లక్షలు డిపాజిట్‌ చేయాలంటూ నేరగాళ్లు చెప్పారు. అంత మొత్తం తన వద్ద లేదని బాధితుడు చెప్పగా.. విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేదంటూ నేరగాళ్లు స్పష్టం చేశారు. త్వరలోనే తమ యాప్‌లోని ఖాతా కూడా బ్లాక్‌ అయిపోతుందని బెదిరించారు. దీంతో తాను రూ.15.2 లక్షల మేర మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement