గాలి వానకు నేలరాలిన మామిడి
కడ్తాల్: మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన వానకు మామిడి తోటలోని కాయలు నేల రాలాయి. అసలే ఈ ఏడాది అంతంతా మాత్రమే కాసిన మామిడి, అకాల వర్షాలకు నేలరాలడంతో తీవ్రంగా నష్ట పోయామని బాధిత రైతులు పేర్కొంటున్నారు. మండల కేంద్రం సమీపంలో బీక్యానాయక్‌కు చెందిన ఆరు ఎకరాల మామిడి తోట గాలి వానకు పూర్తిగా కాయలు నేలరాలడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించి, నష్ట పోయిన మామిడి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మేడే వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తుర్కయంజాల్: మే 1వ తేదీన నిర్వహించనున్న ప్రపంచ కార్మిక దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్ర మోహన్ కోరారు. బుధవారం తుర్కయంజాల్‌లో మేడే వేడుకల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాల్యాద్రి, సత్యనారాయణ, శ్రీనివాసులు, కృష్ణ, మాధవరెడ్డి, జంగయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
లారీలో చెలరేగిన మంటలు
ఇబ్రహీంపట్నం: అకస్మాత్తుగా ఇంజన్‌లో మంటలు చెలరేగి ఓ లారీ దగ్ధమైన సంఘటన ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏపీ నుంచి గ్రానేట్ లోడ్‌తో లారీ హైదరాబాద్‌కు వస్తోంది. మార్గమధ్యలో ఇబ్రహీంపట్నం చెరువు కట్టపైకి రాగానే సాంకేతిక లోపంతో ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ చకచక్యంగా లారీ నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. మంటలకు లారీ ముందుభాగం పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి వచ్చిన ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కానీ ఈ ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
23ఐబీఆర్06:
దగ్ధమవుతున్న లారీని ఆర్పుతున్న
ఫైరింజన్ సిబ్బంది
గాలి వానకు నేలరాలిన మామిడి


