యువత సృజనాత్మకతను అందిపుచ్చుకోవాలి
షాద్‌నగర్: యువత ఆధునిక పరిజ్ఞానంతో సృజనాత్మకతను అందిపుచ్చుకోవాలని రీసోర్స్‌పర్సన్ డాక్టర్ శరత్‌చంద్రారెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, ఐఐసీ సెల్ సంయుక్త సహకారంతో గురువారం ప్రోటోటైప్, ప్రాసెస్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ అంశంపై ఒక రోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేపట్టి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థికవృద్ధిని సాధించడంకోసం ఇలాంటి వర్క్‌షాపులు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలను సాధించడం కాదు ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. వర్క్‌షాపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె, వైస్ ప్రిన్సిపాల్ సృజన, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకురాలు డాక్టర్ శ్రీలత, శ్రీలక్ష్మి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఆఫీసర్ సంతోష, ఐఐసీ సెల్ హెడ్ స్పందన తదితరులు పాల్గొన్నారు.


