రాజ్యాంగాన్ని విస్మరించొద్దు
● రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్
ఇబ్రహీంపట్నం రూరల్: భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, విస్మరించడం తగదని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. యాచారం మండలంలోని కుర్మిద్దలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జైభీమ్ కార్యక్రమం నిర్వహించారు. నాలుగు గ్రామాల రైతులు, కూలీలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రజల అంగీకారం లేనిదే భూసేకరణ చేయకూడదని, బలవంతపు సేకరణ చట్ట వ్యతిరేకమని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా సిటీ రద్దు చేసి రైతుల భూములు రైతులకే ఇవ్వాలని కోరారు. కోర్టు స్టే ఆర్డర్‌ను గౌరవించాలని, రైతులను భయభ్రాంతులకు గురి చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫార్మాసిటీ పోరాట కమిటీ కన్వీనర్లు కవుల సరస్వతి, కుందారపు నారాయణ, మాజీ సర్పంచ్ బందే రాజశేఖర్‌రెడ్డి, కనమోని గణేశ్, మహిపాల్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, శ్రీకాంత్, వినోద్‌రెడ్డి, లింగం, సామ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.


