శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగతున్నాయి. రెండో రోజు మంగళవారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గరుత్మంతుడికి, ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి తిరుమల కిరణాచారి, పరావస్తు రమాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గరుత్మంతుడి పటాన్ని పల్లకిలో ప్రతిష్ఠించి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభానికి ఆవిష్కరించారు. నవకలశ స్నాపకం, గరుత్మంతుని ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. గరుడ పటానికి నాలు గు దిక్కుల గరుత్మంతుని రూపాలు ప్రతిష్ఠించి నైవేద్యాన్ని సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీ నర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, నరసింహన్, మురళీ, కిట్టు, కృష్ణమూర్తి, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
తగ్గిన భక్తుల తాకిడి..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం కార్యక్రమానికి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి నైవేద్యం సమర్పించి సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదాన్ని అందజేసేవారు. గతేడాది లక్షలాది మంది మహిళలు గరుడ ప్రసాదంకోసం రావడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. తోపులాటలు, ట్రాఫిక్ జాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈసారి గరుడ ప్రసాదం పంపిణీ ఉండదని ఆలయ అర్చకుడు రంగరాజన్ ముందుగానే ప్రకటించారు. దీంతో ఈసారి భక్తులు తాకిడి భారీగా తగ్గింది.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందించనున్నారు. గోప వాహనం, హనుమంత వాహనంపై స్వామివారిని ఆసీనులను చేసి ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తారు.
రెండో రోజు కొనసాగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు


