యథేచ్ఛగా మట్టి తరలింపు
కొత్తూరు: ఇటుక వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. వీరి చర్యల వల్ల చెరువులు, కుంటలు, వాగులు ఉనికిని కోల్పోయే దుస్థితి నెలకొంది. గతంలో కొన్ని చోట్ల మిషన్ కాకతీయ ముసుగులో చెరువుల్లో నుంచి మట్టిని ఇటుక బట్టీలకు తరలించారు. మరికొన్ని చోట్ల ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లతో రాత్రి వేళ అక్రమంగా మట్టిని ఎత్తుకెళ్తున్నారు. వీరి ఆగడాలను ప్రశ్నించే నాయకులకు కొంత మొత్తంలో ముట్టజెప్పుతున్నారు. అడ్డుకునే వారిపై దాడులకు సైతం వెనకాడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. చెరువుల్లో తవ్వకాలపై సమాచారం వచ్చినప్పటికీ స్పందించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌శాఖ అధికారులు సకాలంలో స్పందించకపోవడం ఇటుక వ్యాపారులకు కలిసివస్తోందనే చర్చలున్నాయి. తమ దృష్టికి వచ్చిన ఘటనల్లో కొన్ని తవ్వకాలపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేసినప్పటికీ చెరువుల్లో నుంచి మాత్రం అక్రమ తవ్వకాలు ఆగడం లేదు.
ఉనికిని కోల్పోతున్న చెరువులు, కుంటలు... కొత్తూరు మున్సిపాలిటీతో పాటు మండలంలో రికార్డుల మేరకు 42 చెరువులు, కుంటలు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువులు నిండితే సమీపంలోని వ్యవసాయ బోర్లలో నీటి మట్టం పెరుగుతుంది. తద్వార రైతులు వరితో పాటు అయా రకాల పంటలను సాగు చేస్తున్నారు. కాగా కొందరు అక్రమార్కులు అనుమతులు పొందకుండానే యంత్రాలతో చెరువుల్లో నుండి మట్టి, మొరంను తవ్వి విక్రయిస్తున్నారు. యంత్రాలతో తవ్వడం వలన చెరువుల్లో గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో చెరువులోకి నీరు చేరిన కొద్ది రోజుల్లోనే ఇంకిపోతున్నాయి.
మచ్చుకు కొన్ని ఘటనలు
● సిద్ధాపూర్ శివారులోని చెరువులో గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఓ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని వందలాది టిప్పర్ల మట్టిని తవ్వి మహేశ్వరం మండలంలో వేస్తున్న రోడ్డుకు తరలించారు.
● పెంజర్ల శివారులో ఉన్న మామిడోని చెరువులో గతేడాది అర్ధరాత్రి పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లతో ఇటుక వ్యాపారులు మట్టిని తరలించారు. విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు మట్టి తరలింపును అడ్డుకున్నారు. అప్పటికే వందల ట్రిప్పుల మట్టి బట్టీల వద్దకు తరలిపోయింది.
● గూడూరు శివారులోని నందులకత్వ వాగులో ఇటుక, మట్టి వ్యాపారులు అదను చూసి రాత్రి వేళల్లో మట్టి, మొరం తవ్వుతున్నారు. వాగులో తవ్వకాల కారణంగా వర్షాకాలంలో నీరు పంటపొలాల్లో ప్రవహిస్తోంది.
● మున్సిపాలిటీ పరిధిలోని సాయిరెడ్డి చెరువులో నాలుగేళ్ల క్రితం రియల్ వ్యాపారులు యంత్రాలతో పెద్ద ఎత్తున మొరం తరలించారు.
అధికారుల సమన్వయలోపం
చెరువులు, కుంటల్లో నుంచి మట్టిని తరలిస్తున్న సమయంలోనే రెవెన్యూ, ఇరిగేషనన్ శాఖల అధికారులకు స్థానికుల నుంచి సమాచారం అందుతుంది. కాగా వారు మట్టి తరలించడం రెవెన్యూ శాఖ పరిధిలోకి వస్తుందని.. రెవెన్యూ శాఖ అధికారులు చెరువు కాబట్టి ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తుందని సమస్యను ఒకరిపై మరొకరు నెట్టుకోవడం పరపాటిగా మారింది. రెండు శాఖలకు చెందిన అధికారుల సమన్వయ లోపం కారణంగానేఇటుక వ్యాపారులు ఇప్పటికీ రాత్రి వేళ చెరువుల్లోంచి మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఉనికి కోల్పోతున్న చెరువులు
అక్రమ దందాకు తెరలేపిన ఇటుక వ్యాపారులు
పట్టించుకోని అధికారులు
కేసులు నమోదు చేశాం
అనుమతి లేకుండా ప్రభుత్వ భూములు, పాటుకాల్వలు, చెరువుల్లో నుంచి మట్టిని తవ్వడం, తరలించడం నేరం. ఇప్పటికే అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న పలువురికి జరిమానాలు విధించగా మరికొందరిపై కేసులు నమోదు చేశాం. ఇక మీదట చెరువులు, కుంటల్లో అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే చర్యలు తీసుకుంటాం.
– రవీందర్‌రెడ్డి, తహసీల్దార్, కొత్తూరు
యథేచ్ఛగా మట్టి తరలింపు


