మాడ్గుల: మండల పరిధి కొల్కులపల్లిలో వైన్ షాప్‌లో చోరీకి పాల్పడిన నేనావత్ సాయికుమార్‌ను సోమవారం అరెస్టు చేశామని సీఐ వేణుగోపాలరావు తెలిపారు. జనవరి ఒకటిన మద్యం దుకాణంలో దొంగతనం చేశాడని, నిందుతున్ని మాడ్గుల ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని సీఐ వివరించారు.
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
కేశంపేట: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండల పరిధి వేములనర్వ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్డె అనంత(44), భర్త గతంలో మరణించడంతో కుమారుడితో కలిసి ఉంటోంది. మృతురాలు కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెందిన ఆమె.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మామ వడ్డె కిష్టయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
వ్యర్థాలకు నిప్పు
షాద్‌నగర్‌రూరల్: పట్టణ శివారులోని అన్నారం వై జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలకు నిప్పు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వై జంక్షన్ సమీపంలోని ఉడిపి హోటల్ వెనకాల ఉన్న చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు మంటలను ఆర్పారు.
కారు, డీసీఎం ఢీ..
ఇద్దరికి గాయాలు
కేశంపేట: ఎదురెదురుగా డీఎసీఎం, కారు ఢీకొన్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కార్తీక్, కీర్తన్‌లు కంటి ఆస్పత్రికని షాద్‌నగర్‌కు వచ్చారు. తిరిగి గ్రామానికి రాత్రి వెళ్తున్న క్రమంలో మండల పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారు ఐరన్ ఫ్యాక్టరీ వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు క్షతగాత్రులను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం బాధితుడి తండ్రి కరుణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
కందుకూరులో.. ఆరుగురికి
కందుకూరు: కారు, డీసీఎం ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి శ్రీశైలం రహదారి అలిఖాన్‌పల్లి గేట్ వద్ద కల్వకుర్తి వైపు నుంచి వస్తున్న కారు, కడ్తాల్ వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు, డీసీఎం డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కాగా వారి వివరాలు తెలియరాలేదు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
మహేశ్వరంలో.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
మహేశ్వరం: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ సంఘటన మండల పరిధి తుమ్మలూరు– మహేశ్వరం రోడ్డులో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన ఉండెల శివకుమార్(23) డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి మహేశ్వరం నుంచి గుమ్మడవెళ్లి గ్రామానికి పల్సర్ బైక్‌పై వెళ్తుండగా, మహేశ్వరం గ్రామానికి చెందిన రెవేళ్ల యాదగిరి రాయుడు, సురేష్ ఇద్దరు బైక్‌పై తుమ్మలూరు నుంచి మహేశ్వరం వస్తున్నారు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివకుమార్‌కు తీవ్రగాయాలై నగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గాయపడిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్