6,764 మంది ‘పోస్టల్‌’ వినియోగం | Sakshi
Sakshi News home page

6,764 మంది ‘పోస్టల్‌’ వినియోగం

Published Mon, Nov 27 2023 7:10 AM

-

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలోని 6,764 మంది (పీఓ, ఏపీఓ, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు పోలీసు సిబ్బంది) పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి హోళికేరి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీస్‌ సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం వరకు అవకాశం ఉన్నందున వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్‌ సిబ్బంది (పీఓలు, ఏపీఓలు, పీఓపీలు) 23వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 29వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నందున సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ తెలిపారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఓట్‌ ఫ్రం హోం

ఇంటి నుంచి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. గత సోమవారం 20వ తేదీ నుండి ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇంటి నుంచి ఓటు స్వీకరించే ప్రక్రియ ద్వారా మొత్తం 1,817 మంది అర్హులైన వయో వృద్ధులు, దివ్యంగులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ప్రకటించారు. వారి ఓటును సేకరించేందుకు ప్రత్యేక పోలింగ్‌ బృందాలు దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించాయని తెలిపారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి భారత ఎన్నికల కమిషన్‌ ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిందని చెప్పారు. జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు 1,988 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వారి కోసం ప్రత్యేక ఎన్నికల బృందాలు ఏర్పాటు చేసి ఓటర్ల ఇంటి నుంచి ఓటు హక్కు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకున్న వారు తాము ఏ అభ్యర్థికి ఓటు వేశామనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ, స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. పూర్తి గోప్యత ఉండే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసి, బ్యాలెట్‌ పత్రాలతో ప్రిసైడింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారి, పోలీసు అధికారులతో కూడిన బృందాలు వెళ్ళి ఓటర్ల నుంచి ఓటు స్వీకరించాయని, ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు స్వీకరించే ప్రక్రియను పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్‌ జరిపించామని అన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement