● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: బాలల హక్కు ల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లో సాధారణ ప్రజా వాణితోపాటు బాలల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. పిల్లల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీజీఎస్‌సీపీసీఆర్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలలకు సంబంధించిన విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కుల పరిరక్షణ, భద్రత, బాల్యవివాహాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, అనాథ, సంరక్షణ అవసరమైన బాలల సమస్యలు, బాలల అభివృద్ధి అంశాలపై ఫిర్యాదులు, వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులు తమ పరిధిలోని బాలల సమస్యలను ప్రజావాణి ద్వారా అధి కారుల దృష్టికి తేవాలని కోరారు. మెరుగైన భవిష్యత్ అందించడంతోపాటు హక్కులు కా పాడడమే బాలల ప్రజావాణి ఉద్దేశమన్నారు.
నేడు కేటీఆర్ రాక
సిరిసిల్ల: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి కుంబాల మహేందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం జగదాంబతండాలో భూక్యా నవీన్ (యూకే ఎన్‌ఆర్‌ఐ) రిసిప్షన్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట రేణుక ఎల్లమ్మ సిద్దోగ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు వీర్నపల్లి మండలం అడవిపదిరలో మాజీ సర్పంచ్ తిప్పవరపు భాస్కర్ కూతురు రిసిప్షన్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల పట్టణం 9వ వార్డు పెద్దూరులో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు 10వ వార్డు బోనాలలో రుక్మిణి–వేణుగోపాలస్వామి కల్యాణ వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సీనియర్ కౌన్సిలర్ కల్లూరి రాజు కుటుంబాన్ని పరామర్శిస్తారు.
వ్యవసాయం, రాజకీయంలో రెడ్డీల రాణింపు
బోయినపల్లి: రెడ్డి సామాజికవర్గం వ్యవసాయరంగంతోపాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలకేంద్రంలో ఆదివారం మండల రెడ్డి సంఘం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రెడ్డి సంఘ భవనానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండల సంఘం అధ్యక్షుడు చల్ల శ్రీనివాసరెడ్డి, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, మైత్రీ గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు ముదిగంటి సురేందర్‌రెడ్డి, వన్నెల మమత రమణారెడ్డి, సర్పంచులు చింతలపల్లి కవిత వెంకటరెడ్డి, నిమ్మ భాగ్యలక్ష్మి, నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్‌రెడ్డి, డబ్బు తిరుపతిరెడ్డి, డబ్బు వెంకట్‌రెడ్డి, గుడి శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ వినోద్‌రెడ్డి, సంధి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
సాహిత్యం సమాజానికి మార్గదర్శకం
సిరిసిల్ల అర్బన్: సాహిత్యం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో ఆదివారం కవి వెంగళ లక్ష్మణ్ రచించిన విశ్వహిత శతకం పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కవులు, రచయితలు తమ రచనలతో సామాజిక చైతన్యం, నైతిక విలువలను పెంపొందిస్తారన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సాహితీ సమితి అధ్యక్షుడు జనపాల శంకరయ్య, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రచయిత జూకంటి జగన్నాథం, వాసరవేని పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.


