కోడ్ వచ్చినా డబ్బులు లేక తిప్పలు
ఫీజు చెల్లించాలని ఎస్యూ నోటీస్లు
ఆందోళనలో అధ్యాపకులు, విద్యార్థులు
ఎల్లారెడ్డిపేట: ఏళ్లపాటు పోరాటాలు.. ఉద్యమాలు చేసి సాధించుకున్న డిగ్రీ కాలేజీకి మూడేళ్ల తర్వాత కోడ్ వచ్చింది. అయితే కాలేజీలో సొంతంగా నిధులు లేకపోవడంతో శాతవాహన యూనివర్సిటీకి చెల్లించాల్సిన డబ్బుల కోసం అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
డబ్బులు చెల్లించాలని నోటీస్లు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2023–24 విద్యాసంవత్సరంలో ప్రారంభమైంది. మూడేళ్ల తర్వాత అంటే 2026–27 విద్యాసంవత్సరంలో కాలేజీకి కోడ్ కేటాయించారు. ఏటా తనిఖీ ఫీజులు నాలుగేళ్లకు కలిపి రూ.60వేలు, అనుబంధ రుసుం రూ.70,800 మొత్తం రూ.1,30,800 చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా విద్యార్థుల పరీక్ష ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం మరో రూ.70వేల వరకు అవుతుందని అధ్యాపకుల ద్వారా తెలిసింది. దాతలు ముందుకొస్తే కాలేజీ ఆర్థిక సమస్య పరిష్కారమవుతుందని విద్యార్థులు తెలిపారు. దాతలు సాయం చేయాలని కోరారు.


