ఇదేం ‘చెత్త’ పని! | - | Sakshi
Sakshi News home page

ఇదేం ‘చెత్త’ పని!

Nov 8 2026 12:07 AM | Updated on Nov 8 2026 12:07 AM

● చెత్త సేకరించి.. రోడ్డుపై వెదజల్లి ● డంపు యార్డు దారిలో రోడ్లన్నీ కంపు ● సిరిసిల్ల పట్టణంలో సానిటేషన్‌ తీరిది

● చెత్త సేకరించి.. రోడ్డుపై వెదజల్లి ● డంపు యార్డు దారిలో రోడ్లన్నీ కంపు ● సిరిసిల్ల పట్టణంలో సానిటేషన్‌ తీరిది

సిరిసిల్ల: ‘చెత్త బండి వచ్చిందమ్మా.. చెత్తను బండికి ఇవ్వండమ్మా’ అంటూ ఆడియో రికార్డులతో సిరిసిల్లలో దశాబ్దకాలంగా ఇంటింటికీ వెళ్లి ట్రాక్టర్లలో చెత్త సేకరిస్తున్నారు. రోజు విడిచి రోజు మున్సిపల్‌ చెత్తబండి ఇంటింటికీ వస్తుంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంలో సిరిసిల్ల పట్టణానికి అనేక సార్లు జాతీయస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు వచ్చాయి. స్వచ్ఛ సిరిసిల్లగా అవార్డులు పొందిన పట్టణంలో ఇప్పుడు పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. సేకరించిన చెత్తను రోడ్ల వెంట పడిపోతుండడంతో స్వచ్ఛ సిరిసిల్లకు మచ్చగా మారింది. జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో డంపుయార్డు ఉండడంతో అక్కడి వరకు చెత్తను తీసుకెళ్లడం, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తతో సేంద్రియ ఎరువు, పొడి చెత్తతో విద్యుత్‌ ఉత్పత్తికి అందించాల్సి ఉంది. కానీ అవేమీ చేయకుండానే చెత్తను కాలబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వెనకడుగు

సిరిసిల్ల పట్టణం జాతీయస్థాయిలో అవార్డులు సాధించి ఇప్పుడు ఎందుకో వెనకబడింది. కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా అవార్డులను అందించగా.. సిరిసిల్ల పట్టణానికి రాష్ట్ర స్థాయిలో 91వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 471వ ర్యాంకు వచ్చింది. గతంలో మొదటి ఐదు ర్యాంకుల్లో ఉండే మున్సిపల్‌ ఇలాంటి ‘చెత్త’ పనులతో వెనుకబడిపోయింది. పట్టణంలో చెత్త సేకరణ, మురికికాల్వల్లో సిల్ట్‌ తొలగింపులో జాప్యమవుతుంది. చెత్తను సేకరించి ట్రాక్టర్లు, ఆటోలు ఎప్పుడూ రిపేరులో ఉండడం, పారిశుధ్య సిబ్బంది అనారోగ్య సమస్యలతో లీవులో ఉండడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో వెనకబడి ఉండడమే కాకుండా.. పట్టణంలో శానిటేషన్‌ నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తుంది.

సిరిసిల్లలో శానిటేషన్‌ స్వరూపం

పట్టణంలోని వార్డులు : 39

జనాభా : 1.12 లక్షలు

నివాస గృహాలు : 33,125

చెత్తను సేకరించి ట్రాక్టర్లు : 23

చెత్తను సేకరించే ఆటోలు : 09

పారిశుధ్య సిబ్బంది సంఖ్య : 222

నిత్యం డంపుయార్డుకు చేరే చెత్త : 10 మెట్రిక్‌ టన్నులు

ఇది సిరిసిల్ల పట్టణం నుంచి రగుడు డంపుయార్డుకు చెత్త లోడ్‌తో వెళ్తున్న మున్సిపల్‌ ట్రాక్టర్‌. సేకరించిన చెత్త ట్రాలీ నుంచి జారిపోకుండా.. రక్షణగా కవర్‌(జాలి) కట్టాల్సి ఉండగా.. జాలీలు లేకపోవడంతో గాలికి ట్రాక్టర్‌లోని చెత్తంతా రోడ్డుపై పడిపోతుంది. పట్టణం నుంచి చంద్రంపేట, రగుడు, బైపాస్‌రోడ్డు, కలెక్టరేట్‌ సర్కిల్‌ మీదుగా డంపుయార్డు వరకు ప్రధాన రోడ్డు అంతా చెత్తతో నిండిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement