హోరెత్తిన మున్సిపల్‌ కార్మికుల నిరసన | - | Sakshi
Sakshi News home page

హోరెత్తిన మున్సిపల్‌ కార్మికుల నిరసన

Nov 8 2026 12:07 AM | Updated on Nov 8 2026 12:07 AM

సిరిసిల్లటౌన్‌: నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం మూడో రోజు మున్సిపల్‌ కార్మికులు నిరసనలు హోరెత్తించారు. మున్సిపల్‌ ఆఫీస్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్‌బాబు మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ యూనియన్‌ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. నాయకులు మూశం రమేశ్‌, కోడం రమణ, అన్నల్దాస్‌ గణేష్‌, శంకర్‌, అర్జున్‌, బాబా కిషన్‌, దేవరాజు, విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీని ప్రారంభించాలి

గంభీరావుపేట: మండలకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని కోరుతూ బీజేపీ నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. పనులు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలో వైద్య సేవలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి ప్రారంభించాలని కోరారు. తహసీల్దార్‌ మారుతిరెడ్డి, ఎస్సై బాలరాజు సంఘటన స్థలానికి చేరుకొని బీజేపీ నాయకులను సముదాయించారు. పార్టీ మండలాధ్యక్షుడు కోడె రమేశ్‌, కొక్కు దేవేందర్‌యాదవ్‌, దేవసాని కృష్ణ, సత్యనారాయణ, మల్లేశం, గంట అశోక్‌, ఎలేందర్‌, నర్సింలు, మహేశ్‌, దేవయ్య, స్వామి, రాజు, సర్వోత్తం, రవీందర్‌, దేవేందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

అరుణాచలం టూర్‌ ప్యాకేజీ

సిరిసిల్ల అర్బన్‌: భక్తుల సౌకర్యార్థం సిరిసిల్ల టీజీఎస్‌ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో అరుణాచలం టూర్‌ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్‌ భరత్‌కుమార్‌ తెలిపారు. ప్యాకేజీలో భాగంగా కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌, అరుణాచలం, జోగులాంబ ఆలయాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ యాత్ర నవంబర్‌ 18న ఉదయం 5 గంటలకు ప్రారంభమై నాలుగు రోజులపాటు కొనసాగుతుందన్నారు. పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ.3,800 టికెట్‌ ధర నిర్ణయించారు. ఆసక్తి గల భక్తులు 99592 25929, 73828 51366 నంబర్లలో సంప్రదించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని డిపో మేనేజర్‌ కోరారు.

దీపావళి సంబరాలు ఆనందంగా సాగాలి

సిరిసిల్ల: దీపావళిని ఆనందంగా.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని, రోడ్లపై తొందరపాటు చర్యలు వద్దని జిల్లా పోలీసులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేపట్టారు. ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆదేశాలతో ప్రత్యేక పోస్టర్‌ను రూపొందించారు. ఆ పోస్టర్‌పై పలు సూచనలు చేస్తూ అప్రమత్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, టపాసులు కాల్చే ప్రాంతాల్లో అప్రమత్తంగా ప్రయాణించాలని, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మరికొన్ని జాగ్రత్తలు సూచిస్తూ రూపొందించిన పోస్టర్‌ను పోలీసులు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ఎల్లారెడ్డిపేట: మండలంలోని బండలింగంపల్లికి చెందిన ఉత్తమ్‌ భానుప్రకాశ్‌ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్నట్లు డీవైఎస్‌వో రాందాస్‌ తెలిపారు. ఈనెల 1 నుంచి 4 వరకు బిహార్‌లో జరిగిన పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొన్నాడు. అగ్రహారంలో డిగ్రీ చదువుతూ సిరిసిల్లలోని బీసీ హాస్టల్‌లో ఉంటున్న భానుప్రకాశ్‌ మినీస్టేడియంలోని ఖేలో ఇండియా కబడ్డీ సెంటర్‌లో కోచ్‌ ప్రశాంత్‌యాదవ్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement