వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర స్వామి క్షేత్రంలో రాబోయే పవిత్ర కార్తీక మాస ఏర్పాట్లను ఆలయ ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ ఆదివారం పరిశీలించారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ప్రత్యేక పూజా వేదికలు తదితర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ముస్తాబాద్: న్యాయశాస్త్రం కోర్సు పూర్తి చేసుకున్న ముస్తాబాద్ విద్యార్థులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధిత కుటుంబాలకు, పేదలకు సత్వర న్యాయం చేకూరేలా పనిచేయాలని అన్నారు. అమ్మ అన్నపూర్ణ ఫౌండేషన్ అధ్యక్షురాలు కుర్ర సావిత్రి, తదితరులు పాల్గొన్నారు.
వీర్నపల్లి: కార్మికులందరికీ కనీస వేతనంతో పాటు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ అన్నారు. ఆదివారం వీర్నపల్లిలో ఈనెల 25,26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు నిర్వహిస్తున్న ధర్నా కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న ఈ ధర్నాకు భవన నిర్మాణ కార్మికులతో పాటు వివిధ రంగాల కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పొత్తూరి చిన్నరాజం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులతో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
అభినందన
ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలి
5న యువ ర్యాలీ
ఇల్లంతకుంట: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం కరీంనగర్‌లో నవంబర్ 5న యువ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం తెలిపారు. ఆదివారం ఇల్లంతకుంట మండలం దాచారం, గాలిపెల్లి గ్రామాల్లో నిర్వహించిన టిఫిన్ బైఠక్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఏర్పడేందుకే టిఫిన్ బైఠక్ ముఖ్య ఉద్దేశం అన్నారు. కరీంనగర్ జిల్లాలో తలపెట్టిన యువ ర్యాలీలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముత్తవ్వ, నాగ సముద్రాల సంతోష్, బీజేపీ మండల అధ్యక్షుడు భూమల్ల అనిల్‌కుమార్, మండల యువ మోర్చా అధ్యక్షుడు మంత్రి అరుణ్, మారవేణి దివ్య, సుధగోని శ్రీకాంత్‌గౌడ్, పొన్నం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.