● 8వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారన్న సీఎం ● బీఆర్‌ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలన్న కేటీఆర్ ● ముఖ్యమంత్రిపై ‘కొండూరి’ పరువు నష్టం దావా ● సీఎం పర్యటన నేపథ్యంలో పొలిటికల్ హీట్
సిరిసిల్ల: అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన జిల్లాలో రాజకీయ ‘భూ’కంపం సృష్టించింది. బీఆర్‌ఎస్ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కాజేశారనగా.. చట్టబద్ధంగా కొనుగోలు చేశామని కావాలనే అధికార పార్టీ నాయకులు తమను బద్‌నామ్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల లొల్లి రాజకీయ దుమారం రేపుతోంది.
పలువురి అరెస్ట్
● తంగళ్లపల్లి మండలం తాడూరు శివారులో సర్వే నంబర్ 1148లో 11 ఎకరాల అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టాలు పొందారంటూ తహసీల్దార్ ఫిర్యాదుతో తాడూరు మాజీ సర్పంచ్ భర్త సురభీ నవీన్‌రావును 2024లో అరెస్ట్ చేశారు. అక్రమంగా పట్టాలు పొందారని సురభీ సుధాకర్‌రావు, సురభీ సురేందర్‌రావులపైనా తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
● బీఆర్‌ఎస్‌కు చెందిన సిరిసిల్ల బీసీ సంఘం నాయకులు బొల్లి రామ్మోహన్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సోదరుడు జిందం దేవదాస్, సర్ధాపూర్ మాజీ సర్పంచ్ ఒజ్జెల అగ్గిరాములు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి.
విమర్శలు.. ప్రతివిమర్శలు
ప్రభుత్వ భూముల పట్టాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి బుకాయిస్తున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. సర్కారు భూమిని కొనడం, అమ్మడం తప్పయినప్పుడు ఆ పార్టీ అనుచరులను కేటీఆర్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేస్తున్నారు.
అసైన్‌మెంట్ భూములపై లోతుగా విచారణ
ప్రభుత్వ భూముల కేటాయింపులపై రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ భూములను పేదల పేరిట పెద్దలకు పట్టాలిచ్చిన అసైన్‌మెంట్ భూములపై జిల్లా రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో 22–ఏ నిషేధిత భూముల జాబితాలో 3,718 ఎకరాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 91,416 సర్వేనంబర్లు ఉండగా 4,68,532 ఎకరాలు ఉన్నాయి.
స్వచ్ఛందంగా వాపస్
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలకు ప్రభుత్వ భూములను కట్టబెట్టిన తీరుపై అప్పటి కలెక్టర్ సందీర్‌కుమార్ ఝా తీసుకున్న చర్యలు తాజాగా చర్చనీయాంశమైంది. గతంలో కొందరు ప్రభుత్వ భూములను పట్టాలు పొంది స్వచ్ఛందంగా కలెక్టర్‌కు తిరిగి ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. కొందరు ఇవ్వకుండా.. ఇంకా అలాగే ఉంచుకున్నట్లు సమాచారం. దీనిపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా జిల్లాలో ప్రభుత్వ భూముల కేటాయింపులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెలాఖరులో సిరిసిల్లకు వస్తున్న నేపథ్యంలో ఈ భూముల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది.
ఇది 2024.. అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, అప్పటి ఎస్పీ అఖిల్ మహాజన్‌లకు తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ భూమిపత్రాలు అందిస్తున్నారు. పద్మ పేరిట 2018లో తాడూరు శివారులోని సర్వే నంబర్ 545/1/1/3/1లో రెండెకరాల ప్రభుత్వ భూమికి పట్టా పొందారు. తనకు కేటాయించిన ఆ రెండు ఎకరాల భూమిని మాజీ సర్పంచ్ స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు.


