● అంతర్జాతీయ నైపుణ్యాలతో విదేశాల్లో కొలువులు ● మండెపల్లి ఐడీటీఆర్‌లో ట్రెయినింగ్ ● ఎంపికైతే రూ.లక్షల్లో వేతనాలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఉపాధి వేటలో ఉన్న గ్రామీణ యువతకు డ్రైవింగ్ మంచి అవకాశంగా మారింది. విదేశాల్లో డ్రైవర్లకు ఆకర్షణీయమైన వేతనాలు ఉండడంతో జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోని యువత డ్రైవింగ్ శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్(ఐడీటీఆర్)లో శిక్షణ పొందిన వారికి విదేశాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఐడీటీఆర్‌లో శిక్షణ, ఉపాధి అవకాశాలపై స్పెషల్ స్టోరీ.
అంతర్జాతీయ స్థాయి శిక్షణ
మండెపల్లిలోని ఐడీటీఆర్(ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్) కేంద్రంలో అత్యాధునిక వసతులతో ప్రాక్టికల్, థియరీ శిక్షణ ఇస్తున్నారు. వాహనాన్ని రోడ్డుపైకి తీసుకెళ్లే ముందు.. సిమ్యులేటర్ పరికరాల ద్వారా వర్చువల్‌గా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కొనేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ రోడ్డు భద్రత నిబంధనలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, డ్రైవింగ్ ఎథిక్స్‌పై నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. విదేశీ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న భారీ వాహనాలు(హెచ్‌ఎంవీ), తేలికపాటి వాహనాలు(ఎల్‌ఎంవీ) నడపడంలో అనుభవజ్ఞులైన శిక్షకుల ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ అందిస్తున్నారు.
విదేశాల్లో ఉద్యోగావకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు
జిల్లా యువతకు ఈ కేంద్రం విదేశీ ఉపాధికి రాజమార్గంగా మారింది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకొని సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది.
గల్ఫ్, జపాన్ దేశాల్లో డిమాండ్
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి గల్ఫ్ దేశాలతోపాటు సాంకేతికంగా అభివృద్ధి సాధించిన జపాన్‌లో డ్రైవర్ పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. మండెపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి విదేశాల్లో నెలకు రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు వేతనాలు లభిస్తున్నాయి.
యువతకు ఉపాధి భద్రత
గతంలో సిరిసిల్ల ప్రాంతం నుంచి సరైన శిక్షణ లేకుండా విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ మండెపల్లి ఐడీటీఆర్ ద్వారా పూర్తిస్థాయి సాంకేతిక శిక్షణ, లైసెన్స్ ప్రాసెసింగ్ అవగాహన పొంది వెళ్లడంతో ఉద్యోగ భద్రతతోపాటు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.


