జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు పాటించాలి

Sep 11 2026 11:54 PM | Updated on Sep 11 2026 11:54 PM

ముస్తాబాద్‌(సిరిసిల్ల): పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు దరిచేరడం లేదు. పరిసరాల పరిశుభ్రత లోపించడం సర్వ సాధారణంగా మారింది. పల్లె.. పట్టణం అనే తేడా లేకుండా కాలుష్య కోరల్లో చిక్కుకున్నాం. రోజురోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్‌ వినియోగం, పారిశుధ్య నిర్వహణలో ఇబ్బందులతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. దీంతో గాలి, నీరు, భూమి, తినే ఆహారం కలుషితమై జీవరాశుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. జిల్లాలో చెత్త సమస్య గ్రామాలను వెంటాడుతోంది. మండల కేంద్రాలు, పట్టణాల్లో కొంత నిర్వహణ ఉన్నప్పటికీ, వ్యర్థాలను ఏం చేయాలో తెలియక పంచాయతీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యర్థాలను నియంత్రించలేక సిబ్బంది, ఉద్యోగులు చేతులెత్తుస్తున్నారు.

వ్యర్థాలతో జరిగే అనర్థాలు ఇవే..

చెత్త, ప్లాస్టిక్‌ వస్తువులతోపాటు ఇతర తడి, పొడి చెత్తను ఒకే చోట వేయడంతో కొంత భూమిలో కలిసిపోయిన కొంత అలాగే ఉంటుంది. దీంతో చాలా గ్రామాల్లో ప్లాస్టిక్‌ సంచులను కాల్చివేయడంతో గాలి కాలుష్యంగా మారుతుంది. అలాగే భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చెరువులు, కుంటలలో నీరు రంగు మారుతోంది. రసాయన పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితమవుతోంది. చెత్త నుంచి వచ్చే పొగను పీల్చడం ద్వారా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు గాలిలో కలిసి జీవరాశులను ప్రమాదంలోకి నెట్టి వేస్తున్నాయి. దోమలు, దుర్వాసనతో డెంగీ, కలరా, మలేరియా, జ్వరాల బారిన పడుతున్నారు.

డంపింగ్‌ యార్డులు నిరుపయోగం

జిల్లాలోని 255 గ్రామాల్లో డంపింగ్‌యార్డులు నిర్మించారు. కానీ చాలా యార్డులు వృథాగానే ఉన్నాయి. తడి, పొడి చెత్తను వేరుచేసి, ఎరువులను తయారు చేయడం తగ్గిపోయింది. సిరిసిల్ల, వేములవాడ వంటి పట్టణాల్లో చెత్త నుంచి కరెంట్‌ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఉన్నప్పటికీ అది గాలిని కలుషితం చేస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌, కాగితం, గాజు, లోహాలను వేరుచేసి రీసైక్లింగ్‌కు పంపించాలి. ప్రజలను చైతన్యపరచడం ద్వారానే చెత్త, వ్యర్థాలను నిర్మూలించవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్‌హాల్స్‌లో పెద్ద ఎత్తున జరిగే శుభకార్యాల్లో టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ ప్లేట్లు, గ్లాసులు ఉపయోగిండం, వాటిని నేరుగా డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదం. గంభీరావుపేట, ముస్తాబాద్‌, బోయినపల్లి, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ అర్బన్‌, ఇల్లంతకుంటల్లో పారిశుధ్య, చెత్త సమస్య అధికంగా ఉంది.

చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలి. చెత్తను, ప్లాస్టిక్‌ను కాల్చకుండా ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలి. శ్వాసకోస వ్యాధులే కాకుండా, క్యాన్సర్‌, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. గాలి, నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ చింతోజు శంకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement