● కలెక్టర్ గరీమా అగ్రవాల్
వేములవాడ: వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న రాజన్న ఆలయం, నిత్యాన్నదాన సత్రం, బద్దిపోచమ్మ ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, ఇతర శాఖల అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. డ్రైనేజీ, విద్యుత్ టవర్లు, రోడ్డు పనులపై ఆరా తీశారు. ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పనులు వేగంగా పూర్తి చేసేందుకు కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ భీమ్లానాయక్, డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేశ్, నీటి పారుదలశాఖ అధికారి దయాకర్, తహసీల్దార్ జయంత్ ఉన్నారు.


