సిరిసిల్ల/సిరిసిల్లటౌన్: ‘గణపతి బొప్పా మోరియా’ అంటూ భక్తుల నినాదాలు మార్మోగాయి. వినాయక చవితి పండుగకు ఒక్క రోజు ముందు ఆదివారం సిరిసిల్లలో
గణపతుల సందడి నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి వినాయక మండపాల నిర్వాహకులు భారీ విగ్రహాలను తీసుకెళ్లారు. డీజే సౌండ్ మ్యూజిక్ మధ్య గణనాథులు మండపాలకు తరలిపోయారు. వినాయకుడి పూజ సామాగ్రి విక్రయాలతో మార్కెట్‌లో సందడి నెలకొంది. పత్రి, ఎలక్కాయ, పత్రికాయ, మామిడాకులు, అరటాకులు, పండ్లు, వివిధ రకాల పూలు, ఆకులు, ఓనగాయ, మక్కకంకులు కొనుక్కొని వెళ్లారు. గణనాథుడికి ఘన స్వాగతం పలుకుతూ.. గణేశ్ మండపాల నిర్వాహకులు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వినాయకుడి విగ్రహానికి గుడ్డను కట్టి.. భజన చేస్తూ.. మండపాలకు గతంలో తరలించేవారు. కానీ ఆగమనం పేరిట అదిరిపోయేలా.. ఆటాపాటలతో.. డీజే సౌండ్ సిస్టమ్స్‌తో ఘనంగా స్వాగతం చెబుతున్నారు. వారం రోజులుగా వినాయకుడి విగ్రహాలను మండపాలకు అంగరంగ వైభవంగా చేర్చుతున్నారు. ఆగమన వేడుకలను అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. ఇటీవల సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో విశ్వదేవ్ మండప్ ఆధ్వర్యంలో ఆగమన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కళ్లు మిరిమిట్లు గొలిపే భారీ సెట్టింగులు.. వారణాసి గంగాహారతి బృందంతో ఏర్పాట్లు చేశారు. ఈ స్ఫూర్తితో జిల్లాలోని 260 గ్రామాల్లో 1,130 మండపాల నిర్వాహకులు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు.


