● టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు ● సీడ్‌ఫామ్స్ తనిఖీ చేస్తున్న అధికారులు ● నెలాఖరులోగా చేపపిల్లల పంపిణీ ! ● జిల్లాలో 1.46 కోట్ల పిల్లలు లక్ష్యం
బోయినపల్లి(చొప్పదండి): మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చేపట్టే చేపపిల్లల పంపిణీకి ఈ యేడాది జాప్యమవుతుంది. ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉండగా వివిధ కారణాలతో మొదలుకాలేదు. పలువురు కాంట్రాక్టర్లు చేపపిల్లల సరఫరాకు టెండర్లు దాఖలు చేయడంతో ఆలస్యంగా నైనా పంపిణీ చేయవచ్చని మత్స్యకారులు ఆశాభావంలో ఉన్నారు.
1.46 కోట్ల చేపపిల్లలు లక్ష్యం
జిల్లాలో 1.46కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయడం లక్ష్యం పెట్టుకున్నారు. బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్‌మానేరు, గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు, ఇల్లంతకుంట మండలం అనంతగిరి, కోనరావుపేట మండలం మల్కపేట ప్రాజెక్టుల్లో ఏటా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలు వదులుతారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుందనే కారణంతో ప్రతీసారి చేపపిల్లలు పంపిణీ చేసే ఏజెన్సీలు ముందుకురావడం లేదు. ఈసారి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. సిరిసిల్ల, వేములవాడ మండలంలోని పలు గ్రామాలతోపాటు బోయినపల్లి మండలం కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి, నర్సింగాపూర్, జగ్గారావుపల్లి గ్రామాల్లో ఏటా ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో చేప, రొయ్యపిల్లలు వదులుతున్నారు.
సీడ్ ఫామ్స్ తనిఖీల్లో అధికారులు
ఈ సీజన్‌లో చేప పిల్లలు సరఫరా చేయడానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి సీడ్‌ఫామ్స్ తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో పెద్దపల్లి, కామారెడ్డి, ఖమ్మం జిల్లా నాచుపల్లి, తూర్పుగోదావవరి జిల్లాల్లోని సీడ్ పాయింట్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లోని విషయాలతో నివేదికను మత్స్యశాఖ కమిషనర్‌కు సమర్పిస్తారు. క్వాలిఫై అయిన టెండర్ల నుంచి ఫైనాన్సియల్ బిడ్ ఓపెన్ చేస్తారు. ఎవరైతే తక్కువ మొత్తం కోట్‌చేసిన కాంట్రాక్టర్ ఉంటారో అతనికి టెండర్ ఫైనల్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు.
జిల్లాలో చేపపిల్లలు పంపిణీ చేయడానికి నలుగురు కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేశారు. టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల సీడ్‌ఫామ్స్‌ల్లో కలెక్టర్ నియమించిన కమిటీ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తుంది. ఈ నెలాఖరు వరకు చేప పిల్లల పంపిణీ చేస్తాం. – సౌజన్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, సిరిసిల్ల
మత్స్యశాఖ స్వరూపం
మత్స్య పారిశ్రామిక సంఘాలు 117
మహిళా సంఘాలు 47
మత్స్యకారులు 10,156
చేపపిల్లల పంపిణీ లక్ష్యం ఇలా
మిడ్‌మానేరు 28.50 లక్షలు
అప్పర్ మానేరు 10.50 లక్షలు
అనంతగిరి రిజర్వాయర్ 13.69 లక్షలు
మల్కపేట రిజర్వాయర్ 7.49 లక్షలు
456 చెరువుల్లో.. 87.82 లక్షలు


