గంభీరావుపేట(సిరిసిల్ల): ఈ నెలాఖరున సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆదేశాలతో అసెంబ్లీ గేటు ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైడ్రామా సృష్టించారన్నారు. దళిత స్పీకర్‌ను బూతులతో తిట్టి అవమానపరిచారని, పసుపు నీళ్లు పోసి నేలను శుద్ది చేసి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచారన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. పర్శ హన్మండ్లు, మండల మాజీ అధ్యక్షుడు హమీద్, నాయకులు రాజనర్సింహారెడ్డి, బలరాంరెడ్డి, ఎలుక రాజు, గంగి స్వామి, అజాం, బాల్‌రెడ్డి, భాస్కర్‌నాయక్, విఠల్‌నాయక్, సంతోష్, శ్రీనివాస్, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చందుర్తి(వేములవాడ): చందుర్తి తహసీల్దార్ ఆఫీస్ అధికారులపై సోషల్‌మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. మండలంలోని బండపల్లి మాజీ ఎంపీటీసీ గడ్డం రణధీర్‌రెడ్డి రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన నిధులు 2025 జనవరి 1 నుంచి 2026 ఆగస్టు 12 వరకు ఎంత ఖర్చు చేశారు? ఏయే అవసరాలకు వెచ్చించారన్న సమాచారం కోసం అర్జీ పెట్టుకున్నాడు. గ్యాప్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఎంత మందికి ఇచ్చారు? ఎంత మందికి రిజెక్టు చేశారు? అనే వివరాలు కావాలని ఆగస్టు 12న అర్జీ పెట్టుకున్నాడు. గ్యాప్ సరిఫ్టికెట్లు 45 మందికి, ఈడబ్ల్యూఎస్ 49 మందికి ఇవ్వగా.. 10 మందికి రిజెక్టు చేశామని సమాధానం ఇచ్చారు. అనుమానాలుంటే కార్యాలయంలో రికార్డులు చూసుకోవాలని ఈనెల 9న అధికారులు సమాధానం ఇచ్చారు. అంకెలు తప్ప సమగ్ర సమాచారం ఇవ్వలేదంటూ అధికారుల పనితీరును సోషల్‌మీడియాలో విమర్శించడం చర్చనీయంగా మారింది.


