● 1989లో జనశక్తి మద్దతుతో ఎమ్మెల్యేగా ఎన్వీ కృష్ణయ్య విజయం ● నేడు 20వ వర్ధంతి సభ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి వామపక్ష విప్లవోద్యమాల వరకు సిరిసిల్ల చైతన్యవంతమైన భూమిక పోషించింది. ఎన్నికల బరిలో నక్సలైట్లు అభ్యర్థిని నిలిపి విజయం సాధించిన అరుదైన ఘటన ఈ నేల సొంతం. 1989 శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఎన్వీ కృష్ణయ్య జనశక్తి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఎన్వీ కృష్ణయ్య 20వ వర్ధంతి సందర్భంగా ఆనాటి పరిస్థితులపై ‘సాక్షి’ కథనం. – సిరిసిల్ల
జనశక్తి ఉద్యమ చరిత్రలో మైలురాయి
మూడున్నర దశాబ్దాలపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ చిత్రపటంలో జనశక్తి బలమైన ముద్రవేసింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్వీ కృష్ణయ్యను జనశక్తి చట్టసభలకు పంపింది. కృష్ణయ్య గెలుపులో అప్పటి జనశక్తి జిల్లా కార్యదర్శి బోడ లక్ష్మారెడ్డి అలియాస్ భూపతిరెడ్డి అలియాస్ సత్యం కీలక భూమిక పోషించారు. 1973లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి భూపోరాటాలతో మొదలైన రైతుకూలీ సంఘం ఉద్యమం క్రమంగా సీపీఐ (ఎం.ఎల్) చండ్ర పుల్లారెడ్డి వర్గ సాయుధ పోరా టంగా మారింది. తొమ్మిది విప్లవ గ్రూపుల కలయికతో సీపీఐ(ఎం.ఎల్) జనశక్తి సాయుధ నక్సలైట్ల ఉద్యమంగా రూపాంతరం చెందింది. ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదంతో విస్తరించింది.
ఎన్నికలు ఓ ఎత్తుగడ
సాయుధ దళాలతో పోరా టాలు చేస్తూనే ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బ్యాలెట్‌పోరును సాగిస్తున్నామని జనశక్తి నాయకులు చెప్పేవారు. 1983లో వై.కాశీపతి సిరిసిల్లలో ఎమ్మెల్యేగా పోటీచేశారు. 1994 ఎన్నికల్లో అజ్ఞాతంలో ఉన్న జె.చలపతిరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. అంతకుముందు రచయిత పెద్ద విమలక్క, మారోజు వీరన్న, గుంటి వేణు, బడే స్వామిదాస్, చెట్టి రాజేశ్వర్ ఎన్నికల బరిలో నిలిచారు. సిరిసిల్ల, జగిత్యాల, మెట్‌పల్లి, నేరెళ్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. 1991 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్వీ కృష్ణయ్య కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. అప్పట్లో లక్షన్నరకు పైగా ఓట్లు సాధించి జిల్లాలో ద్వితీయస్థానం పొందారు. 1995 స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరిసిల్ల ప్రాంతంలోని పలు ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను జనశక్తి కైవసం చేసుకుంది. సర్పంచ్‌గా గెలవా లన్నా, ఎంపీటీసీగా పోటీచేయాలన్న జనశక్తి కనుసన్నల్లో స్థానిక ఎన్నికలు జరిగేవి.
ఆటుపోట్ల మధ్య జనశక్తి
పార్టీ అగ్రనేత కూర రాజన్న, ఆయన సోదరుడు కూర దేవేందర్ ఉరఫ్ అమర్, మరో నేత సాగర్ ఉరఫ్ ఎడ్ల లక్ష్మీరాజం అరెస్టయ్యారు. అంతకుముందు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రణధీర్ ఉరఫ్ సాయిలు 46 మందితో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఎదుట లొంగిపోయారు.
నేడు సిరిసిల్లలో వర్ధంతి సభ
ఎన్వీ కృష్ణయ్య 20వ వర్ధంతి సభను సిరిసిల్లలో ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి దశరథం ఏర్పాట్లు చేస్తున్నారు.
అసెంబ్లీ వేదికగా ఎన్‌కౌంటర్ ముచ్చట్లు
ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా సిరిసిల్ల ఎమ్మెల్యే ఎన్వీ కృష్ణయ్య న్యాయ విచారణకు డిమాండ్ చేసేవారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలీసుల హింస, బూటకపు ఎన్‌కౌంటర్లపై గొంతు వినిపించేవారు. కృష్ణయ్యకు తోడుగా ఖమ్మం, నల్గొండ జిల్లాల వామపక్ష ఎమ్మెల్యేలు గళం కలిపేవారు. ఎన్వీ కృష్ణయ్య డిమాండ్ మేరకు అప్పటి ప్రభుత్వం ఎన్‌కౌంటర్లపై ఆర్డీవో స్థాయిలో మెజిస్ట్రేరియల్ విచారణలకు ఆదేశించడం విశేషం.


