సిరిసిల్ల: ప్రణాళిక ప్రకారం చదివితే ఉద్యోగ వేటలో విజయం మీదేనని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి, ఆయా సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. ఏమైనా సందేహాలు వస్తుంటే వెంటనే నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలన్నారు. చిన్న చిన్న వైఫల్యాలకు నిరుత్సాహపడకుండా, వాటిని పాఠాలుగా తీసుకుని మరింత పట్టుదలతో ముందుకుసాగాలన్నారు.
సబ్జెక్టుల వారీగా అవగాహన
పోటీపరీక్షలకు అవసరమైన సబ్జెక్టుల వారీగా పరీక్షల విధానం, సమయపాలన, ప్రిపరేషన్ ప్రణాళిక, పరీక్షల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఫిజికల్ టెస్ట్, గ్రౌండ్ ఈవెంట్స్‌కు సంబంధించిన అంశాలపై నిపుణులతో అవగాహన కల్పించారు. సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్, రవీందర్, స్కిల్‌గురు డాక్టర్ విజయరఘు రామరాజు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్ మహేశ్‌కుమార్, నవీన్, సుందర్, అమరేశ్ పాల్గొన్నారు.
కుడికాలువ ద్వారా నీరు విడుదల చేయాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్‌మానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని పొత్తూరు, వంతడుపుల గ్రామాల రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. ఎస్సై ఉపేంద్రచారి పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలాలకు చేరుకొని.. మిడ్‌మానేర్ డీఈ రఘుతో ఫోన్‌లో రైతులతో మాట్లాడించారు. రెండు రోజుల్లో నీటిని విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామన్నారు. పట్నం శ్రీనివాస్, రోడ్ల కరుణాకర్‌రెడ్డి, రాగటి రమేశ్, ఉపసర్పంచ్ నరేశ్, పినకాశి అనిల్, కాట్నపల్లి రవీందర్‌రెడ్డి, పండుగ స్వామి, పరుశురాం పాల్గొన్నారు.
ఐఎంఏ జిల్లా కార్యవర్గం
సిరిసిల్లటౌన్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేములవాడకు చెందిన జనరల్ ఫిజీషియన్ చీకోటి సంతోష్‌కుమార్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సిరిసిల్ల సరయు ఆసుపత్రి పిల్లల వైద్యనిపుణుడు తడుక సాయికుమార్, కోశాధికారిగా శ్రీమహాలక్ష్మి ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ ఎ.జైల్‌సింగ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి.యాదగిరి, డాక్టర్ జి.అభినయ్, సహ కార్యదర్శులుగా డాక్టర్ వెంకట్, డాక్టర్ మోహనకృష్ణ, డాక్టర్ చందన ఎన్నికయ్యారు. ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ శోభారాణి స మక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించగా, ఎన్నికల అధికారిగా డాక్టర్ మనోహర్ వ్యవహరించారు.
సంతోష్‌కుమార్
సాయికుమార్


