● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
సిరిసిల్ల: కక్షిదారులు వివాదాలను పెద్దవి చేసుకోకుండా రాజీతో శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ పేర్కొన్నారు. ప్రీ–లిటిగేషన్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించేందుకు లోక్ అదాలత్ వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 12,666 కేసులు పరిష్కరించి, రూ.2,02,74,283 నష్టపరిహారం ఇప్పించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆవునూరి రమాకాంతరావు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.


