కార్మికక్షేత్రం మురిసింది! | - | Sakshi
Sakshi News home page

కార్మికక్షేత్రం మురిసింది!

Sep 9 2026 11:51 PM | Updated on Sep 9 2026 11:51 PM

ఆత్మహత్యలకు స్వస్తి.. వస్త్రోత్పత్తితో భుక్తి ఆధునిక వస్త్రాల ఉత్పత్తితో బతుకుదెరువు ప్రభుత్వ ఆర్డర్లతో మెరుగైన ఉపాధి పొరుగు రాష్ట్రాల కార్మికుల రాక నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం

కరువు తీరింది..

సిరిసిల్ల: పవర్‌లూమ్స్‌ రాకతో వస్త్రోత్పత్తిలో వేగం పెరిగినా కార్మికుల జీవితాలు నెమ్మదించాయి. కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలతో ఉసురుతీసుకున్న సంఘట నలో నిత్యకృత్యం. ఒక్క రోజు నలుగురు కార్మికుల ఆత్మహత్యలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణం.. ఇవన్నీ దశాబ్దం క్రితం సిరిసిల్లలో ఒకప్పటి మాట. కాలక్రమంలో పరిస్థితులు మారాయి. వస్త్రోత్పత్తిలో సిరిసిల్ల ఉపాధి కేంద్రమైంది. ఆత్మహత్యలు నిలిచిపోయాయి.. వలసలు ఆగిపోయాయి.. ఇప్పుడు చేతినిండా పనితో సిరిసిల్ల ముసిముసి నవ్వులతో మురిసిపోతోంది.

వస్త్రోత్పత్తికి కేరాఫ్‌గా..

ఉమ్మడి రాష్ట్రంలో 74వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 27వేల మరమగ్గాలు ఉన్నాయి. తెలంగాణలో వస్త్రోత్పత్తికి కేరాఫ్‌ అడ్రస్‌గా సిరిసిల్ల నిలుస్తుంది. 24వేల మరమగ్గాలపై పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి అవుతుండగా.. మూడు వేల పవర్‌లూమ్స్‌పై కాటన్‌(ముతక రకం) బట్ట ఉత్పత్తి అవుతుంది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో 25వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా అద్దకం, సైజింగ్‌, వైపణి, వార్పిన్‌ పనులు ఉంటాయి. గతంలో ఉపాధి లేక నేత కార్మికులు పొట్ట చేతపట్టుకుని ముంబై, భీవండి, షోలాపూర్‌, సూరత్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ దశాబ్దకాలంగా సిరిసిల్ల కార్మికులు వలసలకు దూరమయ్యారు. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల కార్మికులు ఇక్కడికొస్తున్నారు. వలసలకు నిలయమైన పట్టణం ఇప్పుడు ఉపాధి కేంద్రంగా భాసిల్లుతోంది.

ఇదీ నేతన్నల ఆత్మహత్యల పరంపర

సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌కు చెందిన కొండ కిష్టయ్య తన తల్లి, తండ్రి, భార్య ఇద్దరు బిడ్డలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిష్టయ్య చిన్న కూతురు ఒక్కరే బతికిపోగా.. ఐదుగురు మరణించారు. ఈ ఘటన 2001లో జాతీయస్థాయిలో వార్తాంశమైంది. ఆ ఆత్మహత్యల పరంపర సిరిసిల్లలో కొనసాగుతూ వచ్చింది.

మార్పునకు కారణాలివీ..

సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి ప్రభుత్వ ఆర్డర్లు వస్తున్నాయి. గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా.. ఇప్పుడు ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు రావడంతో కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది. వస్త్రపరిశ్రమ అనుబంధ రంగాల్లోనూ దాని ప్రభావం ఉంది. నేతకార్మికులకు పొదుపు పథకం త్రిఫ్ట్‌ అమలు చేస్తున్నారు. టవల్స్‌, లుంగీలు, దోవతులు, అంచుచీరలు, పట్టుచీరలు, మెహెందీ వంటి ఆధునిక వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ.. బహిరంగ మార్కెట్‌లో పోటీ పడుతున్నారు. నేతన్నల జీవితాల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది. కార్మిక క్షేత్రంలో ఆత్మహత్యలు తగ్గాయి. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. కుటుంబ సమస్యలు.. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులు కారణమవుతున్నాయి.

సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్యల పరంపర

సంవత్సరం ఆత్మహత్యల ప్రభుత్వ పరిహారం సంఖ్య పొందిన వారు

2010 84 04

2011 93 13

2012 99 19

2013 86 16

2014 65 10

2015 63 33

2016 32 12

2017 19 09

2018 12 02

2019 10 04

2020 06 04

2021 07 07

2022 08 06

2023 06 06

2024 05 05

2025 09 09

2026 03 03ఇప్పటి వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement