● ఏసీ గదుల్లోనూ ఉక్కపోతనే.. ● కనిపించని పరిశుభ్రత ● పట్టించుకోని అధికారులు ● రాజన్న వసతిగృహాల్లో సమస్యల తిష్ట
వేములవాడ: భక్తుల ద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నా వసతులు కల్పించడంలో రాజన్న ఆలయ అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. రాజన్న ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపం.. వసతిగృహాల్లో దుర్వాసన వెదజల్లుతున్నా పట్టింపు కరువైంది. చివరికి ఏసీ వసతిగృహాల్లో ఏసీలు పనిచేయక అద్దె గదుల్లో ఉండలేకపోతున్నారు. రాజన్న వసతిగృహాల్లో అవస్థలపై సాక్షి ప్రత్యేక కథనం.
పేరుకే వసతి గృహాలు
వేములవాడలో భక్తుల కోసం ఆలయ ఆధ్వర్యంలో వసతిగృహాలు నిర్మించారు. నందీశ్వర, లక్ష్మీపార్వతి, పార్వతీపురం, భీమేశ్వర సదనాల్లో భక్తులకు గదులను అద్దెకు ఇస్తున్నారు. గదుల్లో ఏసీలు పనిచేయడం లేదు. దీంతో భక్తులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
లోపిస్తున్న పారిశుధ్యం
వసతి గదుల ఆవరణ, గదుల నిర్వహణ, ప్రాంగణాలు, పరిశుభ్రత లేని శౌచాలయాలతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ వాతావరణంతో భక్తులు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. వసతి గృహాల్లో తలెత్తుతున్న సమస్యలపై సిబ్బందిని ప్రశ్నిస్తే సరైన స్పందన లభించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయ ఉన్నతాధికారులు స్పందించి, వసతిగృహాల నిర్వహణను మెరుగుపరచాలని కోరుతున్నారు.
దుర్వాసన వస్తోంది
ఆలయ వసతి గదుల్లో దుర్వాస వస్తోంది. ఆలయ అధికారులు, సిబ్బంది పట్టించుకున్న పాపానపోవడం లేదు. వసతిగదుల్లో పరిశుభ్రత లోపిస్తుంది. పట్టించుకునే వారు లేరు. ఇప్పటికై నా అధికారులు వసతిగదులను నిత్యం శుభ్రం చేయాలి. – రాపెల్లి శ్రీధర్, స్థానికుడు
ఏసీ గదులు తీసుకుని కార్‌లో నిద్రపోయాం
కుటుంబ సభ్యులతో వచ్చి భీమేశ్వర సదన్‌లో రెండు గదులు తీసుకున్నాం. ఇందుకు అద్దె కూడా చెల్లించాం. తీరా చూస్తే ఏసీ పనిచేయలేదు. అధికారులకు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదు. డబ్బులు వెచ్చించి మా కారులోనే ఏసీ ఆన్ చేసుకుని పడుకున్నాం.
– గోనె కపిల్ దంపతులు, హైదరాబాద్
రెండు రోజుల క్రితం రాజన్న దర్శనానికి హైదరాబాద్‌కు చెందిన గోనె కపిల్ కుటుంబ సభ్యులు వచ్చారు. భీమేశ్వర సదన్‌లో రెండు ఏసీ గదులు తీసుకున్నారు. తీరా ఏసీలు పనిచేయలేదు. అధికారులు, సిబ్బందికి చెప్పినా పట్టించుకోపోవడంతో నిరసనగా గదికి తాళాలు వేసి వెంట తీసుకెళ్లాడు.


