సిరిసిల్లటౌన్: కాటన్ చీరల ఉత్పత్తి కార్మికులు, ఆసాములతో యజమానులు కొత్త కూలి ఒప్పందం కుదిరింది. బుధవారం సిరిసిల్ల చేనేత వస్త్రవ్యాపార సంఘ భవనంలో ఇరు పక్షాల ప్రతినిధులు కలిసి నూతన కూలి ఒప్పందం చేసుకున్నారు. కాటన్ వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ, చేనేత వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌తో పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో కూలి చర్చలు జరిగాయి. కాటన్ వస్త్రానికి పవర్‌లూమ్ కార్మికులకు 20 కౌంటు ప్యాకకు గతంలో 10 పిక్కులకు 44 పైసలు ఉన్న కూలిని 60పైసలు, పాప్లిన్ వస్త్రం 10 పిక్కులకు 44 పైసలకు పెంచారు. ఆసాములకు సంబంధించి డబుల్ కూలి చెల్లించేలా ఇరు సంఘాలు అంగీకరించాయి. ఈ కూలి ఒప్పందం ఈనెల 15 నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించారు. పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ కార్మికులు, ఆసాములు సమ్మెకు వెళ్లకముందే కూలి పెంచడంపై యజమానులకు ధన్యవాదాలు తెలిపారు.
‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్’పై అవగాహన
గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థులకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తున్నట్లు షీ టీం అధికారులు ప్రమీల, రవి తెలిపారు. మండలంలోని గజసింగవరం, గోరింటాల ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత నెలలో షీటీమ్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో మూడు కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థులను వేధిస్తున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసినట్లు తెలిపారు. వేధింపులకు గురైతే షీ టీమ్‌కు 87126 56425లో ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ కోరారు. సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీ అమలు చేయాలని కోరారు. నాయకులు మల్లారపు ప్రశాంత్, కడారి శివ, ముభారక్, రషీద్, సృజన్, శ్రీతన్, మహేశ్ పాల్గొన్నారు.
ఉపసర్పంచుల చెక్‌పవర్ రద్దు చేయండి
సిరిసిల్ల అర్బన్: గ్రామపంచాయతీల్లో అభివృద్ధి, పరిపాలనకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో ఉపసర్పంచుల సంయుక్త చెక్‌పవర్‌ను రద్దు చేసి సర్పంచులకే పూర్తి అధికారాలు కల్పించాలని జిల్లాలోని సర్పంచులు బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఉపసర్పంచుల చెక్ పవర్, డిజిటల్ సంతకాల కారణంగా నిధుల వినియోగంలో జాప్యమవుతుందన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు, అత్యవసర పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు.
ఫీజు బకాయిలపై పోరుబాట
సిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా బకాయిలు పెట్టిన ఫీజులు చెల్లించాలని కోరుతూ సిరిసిల్లలో డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బుధవారం పోరుబాట పట్టాయి. టీపీడీఎంఏ, ఎస్‌యూపీఎంఏ ప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ తీశారు. అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించాలని కోరారు.


