సిరిసిల్లటౌన్: ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలపై సిరిసిల్లలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మంగళవారం పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు నేతృత్వంలో గాంధీ చౌరస్తాలో కేసీఆర్, తాత మధు దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ, అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు మరోసారి దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రతిపక్ష నేత హోదాలో హుందాగా వ్యవహరించాలని, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాగా, దిష్టిబొమ్మల దహనాన్ని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదాలతో జరిగిన తోపులాటల్లో ఓ హోంగార్డు కిందపడిపోయాడు. ఈనేపథ్యంలో అతను దేవరాజు కాలర్ పట్టుకుని లాగడం వివాదాస్పదమై ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీస్ ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మున్సిపల్ ఫోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనాథ్, ఎస్‌కే రియాజ్ తదితరులు పాల్గొన్నారు.


