గడువులోగా సీఎంఆర్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా సీఎంఆర్‌ ఇవ్వాలి

Sep 8 2026 11:47 PM | Updated on Sep 8 2026 11:47 PM

సిరిసిల్ల: జిల్లాలోని రా, బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు గడువులోగా సీఎంఆర్‌ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌తో కలిసి రైస్‌ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మిల్లర్లు తప్పనిసరిగా బియ్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, డీసీఎస్‌వో బుచ్చిబాబు, పౌరసరఫరాల డీఎం గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ వెంచర్లపై కొరడా

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీధర్‌ ఆధ్వర్యంలో పంచాయతీ అధికారులు కొరడా ఝులిపించారు. సర్వేనంబర్‌ 15–ఏ, 15–బీ, 15–సీలో 2.20 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనుమతి లేకుండా వెంచర్‌ ఏర్పాటు చేశారు. నోటీసులు ఇచ్చినా బే ఖాతర్‌ చేయడంతో పాటు, సదరు ప్లాట్లను అమాయక ప్రజలకు అంటగడుతున్నట్లు సమాచారం అందుకున్న ఇంచార్జీ ఎంపీడీవో, కార్యదర్శి శేఖర్‌ మంగళవారం సిబ్బందితో మల్లేశంకు సంబంధించిన వెంచర్‌లో హద్దురాళ్లను తీయించారు. అలాగే సత్తవ్వకు సంబంధించిన అక్రమ లే అవుట్‌ వెంచర్‌పై నోటీసు అందచేసినట్లు కార్యదర్శి తెలిపారు.

మాతృ, శిశు మరణాలను నివారించాలి

సిరిసిల్ల: ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో మంగళవారం ఆశా నోడల్‌ పర్సన్లలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరుగుతున్న గర్భస్రావాలపై ప్రత్యేక నిఘా ఉంచి, కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆశా నోడల్‌ పర్సన్స్‌ తమ పరిధిలోని ఆశా కార్యకర్తల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోగ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, సంపత్‌కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, నయీమ్‌ జహా, సీహెచ్‌వో శాంత తదితరులు పాల్గొన్నారు.

గల్ఫ్‌ కార్మికుల వేదిక ఆవిర్భావ వేడుకలు

సిరిసిల్ల: వృత్తినైపుణ్యంతోనే రాణిస్తారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని దుబాయిలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ డాక్టర్‌ ఇమ్మడి విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. దుబాయి వేదికగా ఏర్పడిన గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక(జీడబ్ల్యూఏసీ) 10వ ఆవిర్భావ సమ్మేళనం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ, జీడబ్ల్యూఏసీ సైనికులు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, ఎన్‌ఆర్‌ఐ పాలసీ నివేదిక తయారు చేయడం జరిగందని, రాష్ట్ర కేబినెట్‌ ముందుకు వెళ్లిందన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వమైన బతుకమ్మ, బోనాలు, జానపద గీతాలను ప్రపంచంలో ఎక్కడున్నా సగర్వంగా ఆచరించి, ఆస్వాదించాలన్నారు. జీడబ్ల్యూఏసీ ప్రతినిధులు రాజ శ్రీనివాస్‌రావు, కృష్ణ దొనికెని, వంశీగౌడ్‌, రవి కటుకం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని రేలరేల గంగ బృందం గీతాలు అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement