మారుపేర్ల సమస్య పరిష్కారానికి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప్రకటన
విశ్రాంత సింగరేణి కార్మికులలోనూ చిగురించిన ఆశలు
ఆధార్ కార్డులు, ఆస్తుల మార్పులు జఠిలం
మారుపేర్లతో నిలిచిపోయిన పలువురి పింఛన్లు
తమకూ న్యాయం చేయాలని సీఎంకు వేడుకోలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
సింగరేణి మారుపేర్లపై ప్రభుత్వం తొలిసారిగా సానుకూల ప్రకటన చేయడం కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపింది. సంస్థలో రెండుపేర్లతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పటికే తాము గుర్తించామని, దీనిపై కమిటీ వేశామని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని సింగరేణి వ్యాప్తంగా కార్మికలోకం స్వాగతిస్తోంది. అదే సమయంలో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని విశ్రాంత కార్మికులు వేడుకుంటున్నా రు. అదే రెండుపేర్ల సమస్య తమనూ నేటికీ వెంటా డుతోందని, కనీసం తాము మరణించేలోగానైనా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో అనేక ఇబ్బందులు పడుతున్నతాము.. ఆస్తుల మార్పిడి, ఆధార్‌కార్డులు, ఇతర గుర్తింపు కార్డుల విషయంలో చెప్పలేని పాట్లు, మానసిక వ్యధ అనుభవిస్తున్నామని వాపోతున్నారు.
ఆస్తులు, పింఛన్ల విషయంలో..
ఇప్పటివరకూ రిటైర్డ్ అయిన వారిలో 35వేల మందికిపైగా విశ్రాంత కార్మికులు రెండుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా 70 నుంచి 80ఏళ్లు పైబడిన వారే. వీరిలో సగానికిపైగా రెండు ఆధార్‌కార్డులు తీసుకున్నారు. ఇదే వీరికి శాపంగా పరిణమించింది. ప్రస్తుతం బ్యాంకులు కేవైసీలు అడుగుతున్న క్రమంలో ఆధార్‌కార్డులు మ్యాచ్ కాక సగానికిపైగా కార్మికుల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికీ వీరి ఆస్తులు వారి సంతానం పేరిట మారకపోవడంతో తల పట్టుకుంటున్నారు. తాజాగా కాస్తోకూస్తో వస్తున్న పింఛన్లు కూడా నిలిచిపోవడంతో తల పట్టుకుంటున్నారు. తమకు కూడా అలియాస్ పేరుతో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నారు.


