ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల/వేములవాడ: గణేశ్ నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మంగళవారం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపం, వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర ఫంక్షన్‌హాల్‌లో గణేశ్ మండపాల నిర్వాహకులు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. గతేడాది నిమజ్జన వేడుకలకు అందరూ సహకరించారని, అక్కడక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే 8 కేసులు నమోదు అయ్యాయన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వాహకులు గణేశ్ పోర్టల్‌లో తమ మండపానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రజా రవాణా, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
మండపాల వద్ద 24 గంటలూ వలంటీర్లు అందుబాటులో ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న విగ్రహాల ఆగమనం సందర్భంగా పోలీసు శాఖకు సమాచారం అందించాలని, నిమజ్జనం రోజు నిర్దేశించిన ప్రదేశానికి వెళ్లాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శోభా యాత్ర, నిమజ్జనం రోజు డీజేలకు అనుమతి లేదని, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సిరిసిల్ల , వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, వెంకటేశ్, వీరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పాల్గొన్నారు.


